గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అనడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 182, వార్డు స్థానాలకు 144 నామినేషన్లు తొలిరోజు దాఖలయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు రెండు జిల్లాల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, నవంబర్ 27
ఖమ్మం జిల్లాలోని మధిర, ఖమ్మం, వైరా నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఉన్న 192 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను తొలిరోజు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1,740 వార్డు సభ్యుల స్థానాలకు గాను 49 నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అనేక గ్రామ పంచాయతీల్లో హోరాహోరీ పోరు నెలకొంది. అలాగే, భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 83 నామినేషన్లు దాఖలయ్యాయి. 1,436 వార్డు సభ్యుల స్థానాలకుగాను 95 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మంచిరోజు కావడంతో పలుచోట్ల సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్ తరఫున సర్పంచ్ పదవులను ఆశిస్తున్న అధికమంది ఆశావహులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ అధికారికంగా అభ్యర్థులను బలపర్చకపోయినప్పటికీ ఒకే గ్రామం నుంచి ఎక్కువ మంది ఆశావహులు తమ నామినేషన్లను దాఖలు చేసి పార్టీ మీద ఒత్తిడి పెడుతున్నారు. అయితే, 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.
ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబుకుతోందని, పల్లె ప్రజల ఆగ్రహంతో బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో విజయ అవకాశాలు మెరుగయ్యాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే అనేక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఇక గురువారం దాఖలైన నామినేషన్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ, ఎంఎల్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఉన్నారు. అయితే, పలు గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూసి.. అందుకు వీలుగా తమ అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైప్పటికీ అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్, వార్డు సభ్యులు పదవులకు అభ్యర్థులు ఖరారు కాలేదు. వీరి అభ్యర్థిత్వాన్ని ఆయా నియోజకర్గాల శాసనసభ్యులు నిర్ణయించాల్సి ఉండడంతో ఏ గ్రామ పంచాయతీకి ఎవరు అభ్యర్థిగా ఖరారవుతారో తెలియని అయోమయం పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం గ్రామాల వారీగా సర్పంచ్ పదవులకు పోటీ చేసే వారిని ఖరారు చేస్తూ నామినేషన్ దాఖలుకు ఆయా గ్రామాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
చింతకాని మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీలకు రిజర్వు అయింది. ఆ గ్రామంలో ఒకే ఒక్క ఎస్సీ కుటుంబం ఉండడంతో ఆ రిజర్వేషన్ వారిని వరించింది. ఆ కుటుంబంలో తల్లీ, కొడుకు ఉండగా.. తల్లి సర్పంచ్‌గా, కొడుకు వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
నామినేషన్ల ప్రక్రియకు రెండు రోజులే సమయం ఉండడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాల ప్రారంభం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గురువారం చాలామంది మంచి రోజని, నామినేషన్లు దాఖలు చేద్దామని నామినేషన్ కేంద్రాలకు వెళ్లిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు తగు నిబంధనలను వివరించారు. కొత్తగా బ్యాంకు ఖాతా కావాల్సిందేనని చెప్పడంతో కొత్త ఖాతాను ప్రారంభించి పాస్‌బుక్‌ను తెచ్చుకోవడం కోసం అభ్యర్థులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వాపురంలో సర్పంచ్ స్థానాలకు 13 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 16 మంది నామపత్రాలు సమర్పించారు. భద్రాచలంలో సర్పంచ్ స్థానాలకు ఇద్దరు, వార్డు స్థానాలకు 12 మంది, బూర్గంపహాడ్‌లో సర్పంచ్ స్థానాలకు 9 మంది, వార్డు స్థానాలకు 10 మంది, చర్ల మండలంలో సర్పంచ్ స్థానాలకు 13 మంది, వార్డు స్థానాలకు ఐదుగురు, దుమ్ముగూడెంలో సర్పంచ్ స్థానాలకు 11 మంది, వార్డు స్థానాలకు 8 మంది, కరకగూడెంలో సర్పంచ్ స్థానాలకు 10 మంది, వార్డు స్థానాలకు ఒకరు, మణుగూరులో సర్పంచ్ స్థానాలకు 10 మంది, వార్డు స్థానాలకు 24 మంది, పినపాకలో సర్పంచ్ స్థానాలకు 15 మంది, వార్డు స్థానాలకు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు.