రుద్రంపూర్, జూన్ 12 : విపత్కర పరిస్థితుల్లోనూ అంకితభావంతో విధులు నిర్వహించిన జనరల్ అండర్ గ్రౌండ్ అసిస్టెంట్లకు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అయితే కొత్తగూడెం ఏరియాలో మాత్రమే వివక్ష కొనసాగుతున్నదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు ఉద్యోగోన్నతి కల్పించాలని కోరుతూ పలుమార్లు ధర్నాలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని వాపోతున్నారు. సింగరేణిలోని ఇతర అన్ని ఏరియాల్లో భూగర్భ గనుల నుంచి ఉపరితల విభాగానికి మారేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ కొత్తగూడెం ఏరియాలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదని ఆరోపిస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపైనా తమకు అవకాశం వస్తుందనే ఆశతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
కొత్తగూడెం ఏరియా పరిధిలోని పద్మావతి గని నుంచి సుమారు 240 మంది కార్మికులను సత్తుపల్లి ప్రాంతంలోని జేవీఆర్వోసీ, జేవీఆర్ సీఎస్పీ, కిష్టారం ఓసీలకు డిప్యుటేషన్ పద్ధతిలో పంపినట్లు కార్మికులు తెలిపారు. రోజూ సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ విధులు నిర్వహించామని, అయినా ఏదో ఒకరోజు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లమవుతామని ఆశ ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు ఏరియాలో ఇప్పటికే మూడుసార్లు అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారని, అక్కడ 2022లో విధుల్లో చేరిన ఉద్యోగులు కూడా సర్ఫేస్కు మారారని పేర్కొన్నారు. కానీ, కొత్తగూడెం ఏరియాలో మాత్రం ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదని ఆరోపిస్తున్నారు.
ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కొత్తగూడెం ఏరియాలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదలైతే సింగరేణివ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధన పెట్టడం వల్ల స్థానిక ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మణుగూరులో గతంలో ఉద్యోగోన్నతులు ఇచ్చినప్పటికీ ఈ నిబంధన ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ ప్రకారం కాకుండా గత మూడు సంవత్సరాల్లో ఎవరు ఎక్కువ మస్టర్లు చేశారనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులు భావించడం కూడా అన్యాయమని కార్మికులు వాపోతున్నారు.
డైరెక్టర్(పా)ను కలిసి సమస్య వివరించగా, కొత్తగూడెం రీజియన్ పరిధిలోని మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల్లో పనిచేస్తున్న వారికి వన్‌టైం సెటిల్మెంట్ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారని తెలిపారు. అయితే అనంతరం మరో సర్క్యులర్ విడుదల చేసి ఇతర ఏరియాల్లో పనిచేస్తున్న సర్ఫేస్ ఉద్యోగులను కొత్తగూడెం ఏరియాకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. దీంతో ఇతర ఏరియాల నుంచి 57మంది కొత్తగూడెంకు వస్తుండగా, ఏరియాలో ఉన్న 150 ఖాళీల్లో వీరికి పోస్టులు కేటాయిస్తే స్థానిక ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కార్మికులు అంటున్నారు.
ఇటీవల మణుగూరు ఏరియాలో 127మంది సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, అక్కడి ఉద్యోగులను కొత్తగూడెంకు ఎందుకు పంపిస్తున్నారో అర్థంకావడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెం ఏరియాలో ఒక్కసారి కూడా సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇవ్వకపోగా ఇతర ఏరియాల్లో అమలు చేయని కొత్త నిబంధనలు ఇక్కడ మాత్రమే తీసుకురావడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ ఒక్కసారైనా గతంలో మణుగూరులో అమలుచేసిన విధానాన్నే కొత్తగూడెంలో కూడా అమలు చేయాలని కోరుతున్నారు.
సర్ఫేస్ మజ్దూర్ల కోసం గతంలో జీఎం కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తాం.. సర్ఫేస్ జనరల్ మజ్దూర్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం.
– వట్టికొండ మల్లికార్జున్, ఏఐటీయూసీ ఏరియా బ్రాంచి సెక్రటరీ