పల్లెల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం. ఈ పథకం కింద పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాల్సి ఉంది. ఇందుకు నిధులను కూడా కేటాయి స్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో కాసేపు సేద తీరేందుకు టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. కూలీలు చస్తే చస్తారు.. మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఎండలో పనిచేసి కొద్దిసేపు సేద తీరేందుకు నీడ లేదు.. తాగునీరు సైతం కూలీలు ఇంటివద్ద నుంచి తెచ్చుకోవాల్సిందే. ఎండాకాలం కూలీలు వడదెబ్బకు గురై ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుందని, తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
– అశ్వారావుపేట, మార్చి 13
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కనీస సౌకర్యాలు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో కూలీల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ వడదెబ్బకు గురవుతామోనన్న భయం వెంటాడుతున్నది. కనీసం నీడ కూడా లేక ఎండల్లోనే పనులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
తాగటానికి నీరు, ప్రమాదవశాత్తు గాయమైతే ప్రథమ చికిత్సకు కిట్లు కూడా ఉండటం లేదు. వైద్యులు మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కూలీలు సేద తీరటానికి నీడ కోసం టెంట్లు పంపిణీ చేసింది. వీటిని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాకుండా 2016 నుంచి మెడికల్ కిట్ల పంపిణీని సైతం నిలిపివేసింది. ఆ మెడికల్ కిట్లలో దూది, అయోడిన్, బ్యాండేజ్, ఓఆర్ఆర్ ప్యాకెట్లు ఉండేవి. వీటిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయటంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ భూమి లేని కూలీలకు రూ.12 వేలు ప్రకటించడంలో ఉపాధిహామీ పనులకు డిమాండ్ పెరిగింది. దీంతో కూలీల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. అధికారులు మాత్రం పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీడ లేక చెట్ల కిందనే కూలీలు సేద తీరుతున్నారు. నీరు ఇంటినుంచే తెచ్చుకుంటున్నారు. ఏమైనా ప్రమాదం జరిగి గాయాలైతే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లోని 481 గ్రామ పంచాయతీల్లో 2.23 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 4.58 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. కానీ యాక్టివ్ జాబ్‌కార్డులు 1.36 లక్షలు ఉండగా.. వీటి పరిధిలో 2.29 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరిలో 11.62 శాతం మంది ఎస్సీలు, 61.12 శాతం ఎస్టీలు ఉన్నారు. ఎక్కువగా గిరిజనులే ఉపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఫాంపాండ్స్, మట్టి రోడ్డు, పశువుల షెడ్లు, నర్సరీ పనులు జరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 21వేల పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 8,070 పనులు పూర్తయ్యాయి. మరో 13వేల పనులు కొనసాగుతున్నాయి. వీటిని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాల్సి ఉంది.
కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే ఎండలతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే కూలీలు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే పనులు చేసుకోవాలి. తలకు ఎండ తగలకుండా టవల్ చుట్టుకోవాలి. నీరు, నిమ్మరసం, మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బకు గురైతే ప్రాణాప్రాయ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.
– డాక్టర్ కె.రాధా రుక్మిణి, ఆసుపత్రి సూపరింటెండెంట్, అశ్వారావుపేట
పని ప్రదేశాల్లో నీడ కోసం ఏర్పాటు చేసే టెంట్ల పంపిణీని ప్రభుత్వం ఎప్పుడో నిలిపివేసింది. తాగునీరు సరఫరా బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించింది. పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రథమ చికిత్సకు అవసరమైన మెడికల్ సామగ్రిని ప్రభుత్వాసుపత్రుల నుంచి సేకరించి త్వరలోనే అందజేస్తాం. ఎండల నుంచి రక్షణ కోసం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందిస్తాం.
– రామచంద్రరావు, ఈజీఎస్ ఏపీవో, అశ్వారావుపేట
ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మేము పనిచేసే చోట అధికారులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదు. మేమే ఇంటివద్ద నుంచి బాటిళ్లలో తీసుకెళ్తాం. అవి అయిపోతే ఇక అంతే సంగతి. చెట్ల కిందనే సేద తీరుతున్నాం. మెడికల్ కిట్లు లేకపోవడంతో ప్రమాదవశాత్తు ఎవరికైనా గాయాలైతే ఆసుపత్రికి పరుగుపెట్టాల్సిందే.
– బానోతు వీర్య, ఉపాధి కూలీ, చండ్రుగొండ