గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట మెడికల్ కళాశాలలు కేటాయించారు.. ఇందులో భాగంగా ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రికి మెడికల్ కళాశాల మంజూరు చేశారు. కొత్తగూడెం, పాల్వంచ మధ్య ఉన్న కేఎస్ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) సమీపంలోని 30 ఎకరాల స్థలంలో యుద్ధప్రాతిపదికన మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. తాజాగా మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలని ఉత్వర్వులు జారీ చేసింది. మరో రెండునెలల్లో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి రావడంతో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ సీట్లు – 150
అసోసియేట్ ప్రొఫెసర్లు – 4
ప్రొఫెసర్లు – 11
అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 10
సీనియర్ రెసిడెంట్ వైద్యులు – 37
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నది.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నారు.. ఆస్పత్రుల్లో సకల వసతులు కల్పిస్తున్నారు.. ల్యాబ్‌లకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను సమకూరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట మెడికల్ కళాశాలలు కేటాయించారు.. దీనిలో భాగంగా పూర్తి ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రికీ మెడికల్ కళాశాల మంజూరు చేశారు.. కొత్తగూడెం, పాల్వంచ మధ్య ఉన్న కేఎస్ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) సమీపంలోని 30 ఎకరాల స్థలంలో యుద్ధప్రాతిపదికన మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. రామవరంలో 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. జిల్లాఆసుపత్రిలో 250 పడకలు సిద్ధమవుతున్నాయి. తాజాగా మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలని ఉత్వర్వులు జారీ చేసింది. మరో రెండు నెలల్లో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
నిర్మాణాలు పూర్తి..
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కళాశాల కేటాయించారు. కళాశాల ఏర్పాటుతో జిల్లాఆసుపత్రితో పాటు రామవరం మతాశిశు సంరక్షణ కేంద్రంలో 330 పడకలు అందుబాటులోకి రానున్నాయి. రూ.130 కోట్ల నిధులతో మాతాశిశు కేంద్రం, నర్సింగ్ కళాశాల, మెడికల్ కాలేజీ భవన సముదాయం రూపుదిద్దుకున్నాయి.
ఏరియా ఆస్పత్రి నుంచి మెడికల్ కళాశాలగా..
గతంలో కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కేవలం 100 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయింది. తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మెడికల్ కళాశాల కేటాయించాలని కోరడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అడిగిన వెంటనే మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కాల్ చేసి చెప్పారు. ఉత్తర్వులు వచ్చిన అనతికాలంలోనే కళాశాల రూపుదిద్దుకున్నది.
62 మంది ప్రొఫెసర్లు, వైద్యనిపుణులు..
రెండు నెలల్లో తరగతులు ప్రారంభంకానున్న నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఒక ఆర్ఎంవో, 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 37 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులను నియమించింది. దీంతో జిల్లా ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య అమాంతం పెరిగింది. మెడికల్ కాలేజీలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యాసంత్సరం నుంచే కాలేజీలో తరగతులు ప్రారంభంకానున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు పర్యవేక్షణలో తరగతి గదులు, సెంట్రల్ లైబ్రరీ, ప్రిన్సిపాల్ చాంబర్, మెడికల్ ల్యాబ్‌ల నిర్మాణం పూర్తయింది. అతి కొద్ది సమయంలోనే కళాశాల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర సర్కార్ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసింది. వసతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరిశీలించి వెంటనే తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో అతి త్వరలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మన్యానికి మహర్దశ పట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, కొత్తగూడెంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇక్కడి తన క్యాంపు కార్యాలయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్‌రావుతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీలోని పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకునేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించినందుకు ఆయన రుణపడి ఉంటామని అన్నారు. తన హయాంలో వైద్య కళాశాల అందుబాటులోకి రావడంతో తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైనప్పుడు సీఎం కేసీఆర్ తనకు స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారని గుర్తుచేశారు.
మొత్తం 150 సీట్లు మంజూరయ్యాయని, ఈ విద్యాసంత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. 150 సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పంపిన లెటర్‌ను చూపించారు. కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలను 330 బెడ్ల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారని, వైద్యులు 40 మందికి పైగా ఉన్నారని అన్నారు. త్వరలోనే ఈ ఆసుపత్రి ప్రారంభం కానుందన్నారు. వైద్య కళాశాల మంజూరు కోసం సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామి, వైస్ ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్, ఆర్ఎంవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష నెరవేరింది
ఏజెన్సీకి ప్రాంతానికి మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్రవైద్యారోగ్యశాఖ హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి తెలంగాణకు మొండిచేయి చూపించింది. సీఎం కేసీఆర్ మాత్రం ప్రత్యేక చొరవ తీసుకుని భద్రాద్రి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయించారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి నిధులు విడుదల చేశారు. తరగతులు, ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి తాజాగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలపడం ఆనందాన్నిచ్చింది. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. త్వరలో ఏజెన్సీవాసులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి..
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే
రెండు నెలల్లో తరగతులు..
కొవిడ్ కారణంగా తరగతుల నిర్వహణ కాస్తంత ఆలస్యమైంది. తరగతుల నిర్వహణ, సీట్ల కేటాయింపునకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. మరో రెండు నెలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. మెడికల్ కళాశాల ప్రారంభమైతే జిల్లాప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
– డాక్టర్ లక్ష్మణ్‌రావు, కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్