మధిర, మార్చి 15: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం తెల్లవారుజామున న్యూస్ పేపర్‌ను (News Paper Auto) సరఫరా చేస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. రఘునాథపాలెం గ్రామానికి చెందిన రాజుల అనిల్ కుమార్ (37) ఖమ్మం నుంచి చింతకాని మండలానికి న్యూస్ పేపర్‌ను సరఫరా చేసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చింతకాని మండలంలోని నరసింహాపురం గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో అనిల్ కుమార్ ఘటనా స్థలంలోనే మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాలను జల్లడపడుతున్నామని ఎస్ఐ షేక్ నాగుల్ మీరా వెల్లడించారు.