ఖమ్మం/ కొత్తగూడెం టౌన్, డిసెంబర్ 31: జీవన చక్రంలో కాలచక్రం గిర్రున తిరిగింది. కష్ట సుఖాలు, మంచి చెడులు, తీపి చేదు అనుభవాలతో 2023 ఇట్టే గడిచిపోయింది. కోటి ఆశల నడుమ 2024 వచ్చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉమ్మడి జిల్లావాసులు సంబురాలు ప్రారంభించారు. యువత కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అందరి మొబైల్స్‌లో వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రాంలో ‘న్యూఇయర్ శుభాకాంక్షలు’ మెసేజెస్ వెల్లువెత్తాయి. ప్రతిఒక్కరూ బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ గడిపారు. నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. సామూహికంగా కేక్ కట్ చేసి పంచుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి తమ ఇంటి వాకిళ్లను అందంగా అలంకరించారు. కొందరు కొత్త సంవత్సర రెసల్యూషన్స్ పెట్టుకున్నారు. ఒకరు కొత్త సంవత్సర ఆరంభం నుంచి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్దామని తీర్మానించుకుంటే మరికొందరు లిక్కర్‌కు గుడ్ బై చెబుదామని నిర్ణయం. ఇలా ఒకటేమిటి.. ‘మనిషికో బుద్ధి.. జిహ్వకో రుచి’ అని ఎవరి ఆకాంక్షలు వారివి.
కొత్త సంవత్సరం రాక సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెంతో పాటు ప్రధాన పట్టణాల్లోని వ్యాపార సముదాయాలు కిటకిటలాడుతూ కనిపించాయి. రెస్టారెంట్లు, హోటల్ కేక్‌లు, కూల్‌డ్రింక్స్, బిర్యానీలపై స్పెషల్ ఆఫర్లు పెట్టి విక్రయించాయి. స్వీట్‌షాపులు, బేకరీల్లో రద్దీ కనిపించింది.
నూతన సంవత్సరం ఆరంభం సందర్బంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని చర్చీలు, దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేశారు. బంధువులు, స్నేహితులు, మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
2023 చరమాంకంలో అసెంబ్లీ ఎన్నికలు హీట్ ఎక్కించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎవరూ ఊహించని రేంజ్లో తారుమారయ్యాయి. 2023 కొందరు నాయకులకు సంతోషంతో పాటు పదవులు మిగల్చగా కొందరికి నిరాశ మిగిల్చింది. ‘బెటర్ లక్ టు నెక్స్ టైమ్’ అంటూ బై చెప్పింది. ఇదే స్థాయిలో ఇతర నేతలకు గెలుపును కట్టబెట్టి తీపి జ్ఞాపకాలను అందించింది. ఇక కొత్త సంవత్సరంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలు కానున్నది. ఈ ఏడాది ఆరంభంలోనే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నూతన సంవత్సరం ఆరంభం నుంచి ఆరు నెలల పాటు ఎన్నికల కొలాహలం మధ్య సగం సంవత్సరం ముగియనున్నది. ఇవి కాకుండా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా లభించే పదవులు, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూసే రాజకీయ నాయకుల అదృష్టం తేలనున్నది. వెరసి.. 2024 ఎన్నికల నామ సంవత్సరమే..!
నూతన సంవత్సరంలో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిలాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని, వారి ఆశలను నెరవేర్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలనిమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల ఆకాంక్షించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.