దుమ్ముగూడెం, అక్టోబర్ 26 : విద్యార్థులు చిన్ననాటి నుంచి కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి పాత నారాయణరావుపేటలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్ కోసం గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరారని, దీంతో ఐటీడీఏ నుంచి రూ.4.50 లక్షల నిధులు మంజూరు చేయించి గ్రామంలో తాత్కాలిక పాఠశాలను ఏర్పాటు చేయించామని, దీనిని స్వయంగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే కోయభాష నేర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని, భాషా, సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించి తప్పనిసరిగా వివరించాలన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్సిళ్లు తదితర సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం బొజ్జిగుప్పలో పాతకాలపు మట్టితో కట్టిన ఇంటిని పరిశీలించిన పీవో.. ఇలాంటి ఇంటి నిర్మాణం భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియంలో చేపట్టాలని మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామికి సూచించారు. కాగా.. పాఠశాల ఏర్పాటు చేయించిన పీవోను గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీఈ హరీశ్, ఏఈ రవి, నారాయణరావుపేట పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, సర్వేశ్వర దొర, తల్లిదండ్రులు పాల్గొన్నారు.