మధిర, ఆగస్టు 2 : రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకంతో ధీమా కల్పిస్తున్నది. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కుటుంబ అవసరాలకు తిండి గింజలు పండించుకోవడంతోపాటు మిగిలిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ జీవనం సాగించే రైతులెందరో ఉన్నారు. ఇటువంటి రైతాంగాన్ని పట్టించుకోని రాష్ర్టాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచారు. వారి కోసం.. రైతుబంధు, రాయితీపై వ్యవసాయ పరికరాలు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా అందిస్తూ భరోసాగా నిలిచారు. ప్రమాదవశాత్తు వ్యవసాయ కుటుంబానికి చెందిన రైతు మరణిస్తే ఆయనపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారేది. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయేవి. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిన పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ హయాంలో రైతు మరణిస్తే ఆపద్బంధు పథకం కింద కేవలం రూ.50వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. రైతుబీమా పథకంతో ఒక్కో రైతుకు రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ.. ఎల్ఐసీకి ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
సీఎం కేసీఆర్ అలోచనలతో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల్లో ఒక్కటైన రైతుబీమా పథకం ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుబీమా పథకాన్ని 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి రైతులకు మనోధైర్యాన్ని కల్పించింది. కుంట భూమి ఉన్న రైతు దగ్గర నుంచి ఎకరాల భూమి ఉన్న వారు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి రైతుకు బీమా పథకాన్ని అందిసున్నది. సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణించిన రైతుకు 10 రోజుల్లోపే ఆ రైతుపై ఆధారపడిన నామినీకి రూ.5లక్షలు వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
రైతుబీమా పథకంతో జిల్లాలో ఎన్నో రైతు కుటుంబాలు ప్రయోజనం పొందాయి. జిల్లాలో 2018 నుంచి ఐదేళ్లలో 813 మంది రైతు కుటుంబాలకు రూ.40.65కోట్లు అందజేశారు. 2019లో రైతులు 840.. రూ.42.00కోట్లు. 2020లో 1,209 రైతులు.. రూ.60.45కోట్లు. 2021లో 895 రైతులు.. రూ.44.75కోట్లు. 2022లో 441 రైతులు.. రూ.22.05కోట్లు.. ఇలా జిల్లాలో మొత్తం 4,198 మంది రైతు కుటుంబాలకు రూ.209.90కోట్లను అందజేశారు. మధిర నియోజకవర్గంలోని మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, ఎర్రుపాలెం మండలంలోని 979 రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.48.95కోట్లు బాధిత రైతు కుటుంబాలకు బీమా సంస్థ చెల్లించింది.
జిల్లాలో ఇటీవల రైతుల నుంచి భూమి కొనుగోలు చేసిన వారు ఆగస్టు 5వ తేదీ వరకు రైతుబీమా చేయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూన్ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. పూర్తి చేసిన దరఖాస్తులను గ్రామాల్లోని రైతు వేదికల్లో అందుబాటులో ఉన్న ఏఈఓలకు అందజేయాలని ప్రభుత్వం సూచించింది.
రైతుబీమాతో ధీమాగా ఉన్నాం
నాకు ఎకరం పొలం ఉంది. నా భర్త కరోనాతో మృతి చెందాడు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోక ముందే కూతురు పెళ్లి చేశాం. ప్రభుత్వం రైతుబీమా వర్తింపజేయడంతో సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిచినట్లయింది. నా భర్త కరోనాతో చనిపోయిన పది రోజుల్లో రైతుబీమా ద్వారా రూ.5లక్షల బీమా సొమ్ము అందించారు. సీఎం కేసీఆర్ మా కుటుంబానికి దేవుడయ్యారు.
-పంతంగి లక్ష్మి, రైతుబీమా లబ్ధిదారు, మాటూరుపేట, మధిర మండలం
బీమాతో కొండంత అండ
ఏడాది క్రితమే అనారోగ్యంతో నా భర్త మృతిచెందాడు. ఏ కార్యాలయానికి తిరగకుండానే వారం రోజుల్లో నా అకౌంట్లో రూ.5లక్షలు జమ అయ్యాయి. ఇద్దరు కూతుళ్లున్న నాకు రైతుబీమా ద్వారా పొందిన రూ.5లక్షలతో భర్త ఆస్పత్రి ఖర్చులు, పెద్దకూతురు పెళ్లి ఖర్చులన్నీ కలిపి మిగిలిన అప్పు రూ.2లక్షలు ఒక్కసారిగా తీర్చాను. ఇంకా రూ.2లక్షలు మిగిలాయి. వాటితో నా చిన్నబిడ్డ పెళ్లి చేస్తాను. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం నా కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.
-ఎలగందుల ఈశ్వరమ్మ, ప్రొద్దుటూరు, చింతకాని మండలం
బీమా డబ్బుతో అప్పు తీర్చా
నా భర్త కోటయ్య అప్పుల బాధ భరించలేక 2022లో ఆత్మహత్య చేసుకున్నాడు. మాకున్న 11 కుంటల పొలాన్ని సాగు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేశాం. ఈ క్రమంలో కొంత అప్పు అయింది. దీనికి వడ్డీ కట్టలేక ఇబ్బందిపడ్డాం. మనిషి పోయినా.. ప్రభుత్వం అందించే రైతుబీమా డబ్బులు రూ.5లక్షలు రావడంతో అప్పు తీర్చా. రైతు బీమా లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. సీఎం కేసీఆర్ సారు వల్లనే నేను అప్పు తీర్చి సంతోషంగా ఉన్నా. ఆయన మల్లా సీఎం అయి నాలాంటి ఎందరో పేదలను ఆదుకోవాలి.
– ఇనుప మంగమ్మ, లబ్ధిదారు, చిరుమర్రి