ఖమ్మం అర్బన్, నవంబర్ 11 : ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పాఠశాలలకు అనధికారికంగా గైర్హాజరైతే చర్యలు తప్పవని డీఈవో చైతన్య జైనీ హెచ్చరించారు. మంగళవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, వృత్తిపరంగా ఎక్కడా రాజీపడేది లేదన్నారు. జిల్లాలో వెయ్యికిపైగా ఉన్న పాఠశాలల్లో రోజుకు రెండు నుంచి నాలుగు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేసేలా ప్రణాళికలు వేసుకుంటానని చెప్పారు.
పాఠశాలలకు ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లే ఉపాధ్యాయులపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకే మొదటి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. విద్యాశాఖ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్, అదనపు కలెక్టర్ మార్గదర్శకాలతో జిల్లా విద్యాశాఖను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలా శ్రమిస్తానన్నారు. విధి నిర్వహణలో నిజాయితీతో ముక్కుసూటిగా వ్యవహరిస్తానని, గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనూ అదేవిధంగా వ్యవహరించానని చెప్పారు. విద్యార్థుల ప్రగతి కోసమే అందరం కలిసికట్టుగా పని చేయాలని పేర్కొన్నారు.
డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య జైనీ
చైతన్య జైనీ మంగళవారం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజను, అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో కలెక్టర్.. విద్యాశాఖలోని పలు అంశాలపై సూచనలు చేశారు. విద్యాశాఖ తనకు ప్రథమ ప్రాధాన్యత అని, ఎఫ్ఆర్ఎస్, ఆధార్, అపార్, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి ఉండాలని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. అనంతరం కార్యాలయ ఇన్చార్జి చావా శ్రీను ఆధ్వర్యంలో సెక్టోరల్ అధికారులు రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, ప్రవీణ్, భాను, రూబీ పంకజంలు డీఈవోకు పుష్పగుచ్ఛం అందజేశారు.

Khammam1
శిక్షణ కేంద్రాలను సందర్శించిన డీఈవో
డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వేసవిలో గైర్హాజరైన టీచర్లకు, ఇటీవల పదోన్నతులు పొందిన వారికి కల్పిస్తున్న వృత్యంతర శిక్షణ కేంద్రాలను ఆమె సందర్శించారు. నగరంలోని డైట్ కళాశాల, శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిక్షణ కల్పిస్తున్న సరళిని డీఈవో పరిశీలించారు. రిసోర్స్ పర్సన్లు వివరిస్తున్న మెళకువలను ఉపాధ్యాయులతో పాటే బెంచీల్లో కూర్చొని విన్నారు.
పర్సనల్ ప్రొఫైల్…
తల్లిదండ్రులు : ప్రభాకర్ జైన్(మూవీ డైరెక్టర్), విజయలక్ష్మి (గృహిణి)
తమ్ముడు : ఆకాష్(పోటీ పరీక్షలకు సన్నద్ధం)
అక్క : స్రవంతి(బిజినెస్)
భర్త : రామకృష్ణ(ఏపీఐడీసీ జనరల్ మేనేజర్)
ఎడ్యుకేషన్ : ఎంఏ(తెలుగు), ఎమ్మెస్సీ(యోగా)
ఉద్యోగాలు : ఐదు ఉద్యోగాలు వచ్చాయి. 18 ఏళ్ల వయసులో ఇక్రిశాట్లో స్టెనోగా, 2005లో ఏసీటీవో, ఎస్ఐ స్టెనో, జూనియర్ లెక్చరర్(తెలుగు), 2008 గ్రూప్-1 నోటిఫికేషన్లో డిప్యూటీ డీఈవోగా పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్.
స్వస్థలం : వరంగల్, ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు వరంగల్‌లో, తర్వాత ఇతర ప్రాంతాల్లో పూర్తి చేశారు.