భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (నమస్తే తెలంగాణ): గొప్ప సంస్కరణలతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. తెలంగాణ జాతిపిత అయ్యారని అన్నారు. భద్రాద్రి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందు వరుసలో ఉందని అన్నారు. ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యమంతి వల్లనేనని అన్నారు. మారుమూల ఏజెన్సీగా ఉన్న ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉన్పప్పటికీ కేంద్రం స్పందించకున్నా సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని దానిని పరిష్కరించారని అన్నారు. ఏజెన్సీలో వైద్యం అందని ద్రాక్షగా ఉన్న తరుణంలో మన్యానికి మెడికల్ కాలేజీ మంజూరు చేసి తరగతులను కూడా ప్రారంభింపజేశారని గుర్తుచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భద్రాద్రి జిల్లా దేశంలో ఉన్నత స్థానాన్ని సాధించడం సీఎం కేసీఆర్ కృషేనని అన్నారు. కొత్తగూడెంలోని విశాలమైన ప్రాంగణంలో కలెక్టరేట్ సముదాయం ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. గోదావరి జలాలు వృథాగా పోతుంటే మంచి ఆలోచనతో సీతారామ ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచన ఎంతో గొప్పదని అన్నారు. దీంతోపాటు సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటామని అన్నారు.
అప్పట్లో ఇలాంటి కలెక్టరేట్లు లేవు: సీఎస్ శాంతికుమారి
ఇప్పటి వరకూ చూసిన కలెక్టరేట్లలో ఇలాంటి కలెక్టరేట్‌ను తానెప్పుడూ చూడలేదని, తమ కాలంలో ఇలాంటి కలెక్టరేట్లు లేవని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. తెలంగాణలోనే ఇలాంటి విప్లవాత్మక మార్పులు జరిగాయన్నారు. ఇంత సువిశాల ప్రాంగణంలో అట్టహసంగా ప్రారంభించిన కలెక్టరేట్ చాలా అద్భుతంగా ఉందన్నారు. అదేస్థాయిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజలకు పాలన దగ్గరవడం కోసం అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించడం శుభసూచికమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ సభలో ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంతిరెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెరెడ్డి, తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు హరిప్రియ, బాల్కసుమన్, రాములునాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్యే బాల్కసుమన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కలెక్టర్ అనుదీప్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రథసారథి కేసీఆర్: ఎమ్మెల్యే వనమా
తెలంగాణ రథసారిథి కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయన పథకాలు దేశానికి దిక్సూచిలా నిలిచాయని స్పష్టం చేశారు. ఉద్యమనేతగా ఆయన ప్రతీ ఊరూ, ప్రతీ వాడా వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలన్నీ తెలుసుకున్నారని, ఆ అనుభవంతోనే ప్రజలకు ఉపయోగకరమైన పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి అద్భుత పథకాలు అందులో భాగమేనని గుర్తుచేశారు. కొత్తగూడెం నియోజకవర్గానికి రూ.వేల కోట్లు నిధులు మంజూరు చేసిన సీఎంకు తామెప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. ఇప్పటికే పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
ప్రజల సమస్యలు కేసీఆర్‌కు తెలుసు..
సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ నిధులతో పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే కొత్తగూడెం పట్టణం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. తెలంగాణ ఇతర రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఉద్యమ నేత, సీఎం కేసీఆర్‌కు ప్రజాసమస్యలన్నీ తెలుసు. అందుకే ఆయన దేశానికే దిక్సూచిలా ఎదుగుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తప్పకుండా విజయం సాధించారు. తెలంగాణ తరహా అభివృద్ధిని దేశమంతా తీసుకొస్తారు.
– కాపు సీతాలక్ష్మి, మున్పిపల్ చైర్పర్సన్, కొత్తగూడెం
జంట పట్టణాల అభివృద్ధికి నిధులు..
కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయం. తెలంగాణ వచ్చిన తర్వాతే పట్టణాల అభివృద్ధి సాధ్యమైంది. కొత్తగూడేనికి మెడికల్ కాలేజీ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇంత విశాలమైన ప్రాంతంలో కలెక్టరేట్ అందుబాటులోకి వస్తుందని ఊహించలేదు. ఆ కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.
– ఎండీ మంజార్, ఉద్యమకారుడు, పాల్వంచ
పంచాయతీలకు మహర్దశ..
జిల్లాలోని ఒక్కో పంచాయతీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించడం హర్షణీయం. కొత్తగా ఇచ్చే నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికే ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ అందుబాటులోకి వచ్చాయి. వైకుంఠధామం, డంపింగ్ షెడ్, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. కొత్త పంచాయతీ భవనాలు నిర్మితమయ్యాయి. మొర్రేడు వరదల కట్టడికి ప్రహరీ నిర్మిస్తే మా పంచాయతీకీ వరద ముప్పు తప్పుతుంది.
– భూక్యా పద్మ, సర్పంచ్, సంజయ్‌నగర్, లక్ష్మీదేవిపల్లి మండలం