పినపాక, సెప్టెంబర్ 1: ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు పలకాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అబ్బురపడేలా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వైపు పొరుగు రాష్ర్టాలూ చూస్తుండడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. మండలంలోని జగ్గారం, పాండురంగాపురం, జానంపేట, చేగర్శల, టీ కొత్తగూడెం గ్రామాల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జగ్గారంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న రెండు సీసీ రోడ్లకు, పాండురంగాపురంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న రెండు సీసీ రోడ్లకు,
చేగర్శలలో రూ.15 లక్షలతో నిర్మించనున్న 3 సీసీ రోడ్లకు, దుగినేపల్లిలో రూ.15 లక్షలతో నిర్మించనున్న 3 సీసీ రోడ్లకు, టీ కొత్తగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న 2 సీసీ రోడ్లకు, రెడ్డిగూడెం – టీ కొత్తగూడెం మధ్య రూ.7 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్తో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. జానంపేటలో రూ.50 లక్షలతో నిర్మించిన 10 సీసీ రోడ్లనును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి గడిచిన ఐదేళ్లలో రూ.వేల కోట్ల నిధులు తీసుకొచ్చామని, ప్రతీ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టి 90 శాతం పూర్తిచేసామని వివరించారు. ఆయా గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు గుమ్మడి గాంధీ, కంది సుబ్బారెడ్డి, దాట్ల సుభద్రావాసుబాబు, పగడాల సతీశ్‌రెడ్డి, భద్రయ్య, వర్మ, కోలేటి భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.