తిరుమలాయపాలెం, జూలై 6: ఖమ్మం జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలోని తిరుమలాయపాలెం సహకార సొసైటీ, మార్క్‌ఫెడ్ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలు అమ్ముకున్న రైతుల పేర్లు ఆన్లైన్లో గల్లంతై వారి అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. తిరుమలాయపాలెం మండలంలోని తెట్టెలపాడుకు చెందిన బిల్లగిరి లక్ష్మణ్‌రావు, ఉపేందర్‌రావు, తొర్రికొండ రమేష్, బొమ్మగాని సైదమ్మ, తాళ్లూరి విజయలక్ష్మి, మోతుకూరి ఉష, రెడ్డిమళ్ల యల్లమ్మ అనే రైతులు గత మే 10వ తేదీన తిరుమలాయపాలెం పీఏసీఎస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 362 క్వింటాల మొక్కజొన్నలను అమ్మారు.
వారి మొక్కజొన్నలు యాదాద్రి భువనగిరి జిల్లా టేకులసోమవరం గిడ్డంగిలో దిగుమతి చేశారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్, తిరుమలాయపాలెం సొసైటీ అధికారులు రైతులకు ఎకనాలెడ్జిమెంట్ డ్రగ్ షీట్స్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెలలు గడుస్తున్నా మొక్కజొన్నల డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్లో పడకపోవడంతో బాధిత రైతులు బీఆర్ఎస్ మండల నాయకులు బిల్లగిరి ధనుంజయ, గుంటి పుల్లయ్య తదితరులను తీసుకొని ఖమ్మం మార్కెట్ కార్యాలయానికి సోమవారం వెళ్లారు. ఇంకా డబ్బులు అకౌంట్లో జమకాని విషయమై వివరణ కోరారు.
ఈ విషయమై మార్క్‌ఫెడ్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ కల్యాణ్‌కుమార్ చెక్ చేసి మీ పేర్లు అసలు ఆన్లైన్లో కనిపించడం లేదని తెలిపారు. అసలు మీరు మొక్కజొన్నలు అమ్మారా లేదా ఎవరికి తెల్సు అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు రైతులు వాపోయారు. ఈ విషయమై బాధితులు ఫోన్లో మార్క్‌ఫెడ్ డీఎం నర్సింహకు ఫిర్యాదు చేశారు. మొక్కజొన్నలు అమ్ముకున్నట్లు మా వద్ద అన్ని ఆధారాలున్నా పేర్లు ఆన్లైన్లో గల్లంతు కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు డబ్బులు అకౌంట్లో జమకాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలు అమ్ముకుంటే ఆన్లైన్లో పేర్లు లేవంటున్నారు. అధికారులు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు మొక్కజొన్నల డబ్బులు వస్తాయో రావో అర్థంకావడం లేదు. భయంగా ఉంది. దయచేసి ఉన్నతాధికారులు పట్టించుకొని న్యాయం చేయాలి.
– బొమ్మగాని సైదమ్మ, మహిళా రైతు, తెట్టెలపాడు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా
తిరుమలాయపాలెం మండలంలోని తెట్టెలపాడుకు చెందిన మొక్కజొన్న రైతులకు వారంరోజుల్లో డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తాం. రైతులు అవగాహన లేక ఆన్లైన్లో పేర్లు లేవు అనుకుంటున్నారు. భువనగిరి జిల్లా టేకులసోమవారం గోదాముకు దిగుమతి చేసిన రైతులకు ఎవరికీ ఇంకా డబ్బులు రాలేదు. ఆ గిడ్డంగికి దిగుమతి అయిన రైతులకు రూ.60 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.
– బత్తుల నర్సింహ, ఖమ్మం మార్క్‌ఫెడ్ డీఎం