అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 6 : ప్రకృతి వ్యవసాయానికి మించింది లేదు. అయితే ప్రస్తుతం రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా వ్యవసాయం చేసేందుకే రైతులు జంకుతున్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్లీ మామూలు స్థితికి రావాలంటే గో ఆధారిత వ్యవసాయమే చేయాలి. మూడేళ్ల పాటు కొంచెం కష్టపడితే చాలు.. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయానికి భూమి అలవాటు పడుతుంది. పెట్టుబడులు, ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి. భూమి వాసనలో కూడా మార్పు వస్తుంది. ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు ప్రకృతి వ్యవసాయమే మేలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు సైతం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాయి.
ఉద్యానవన పంటలకు నిలయాలుగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు ప్రసిద్ధి. ఆంధ్రాలోని కోనసీమను తలపించేలా ఈ ప్రాంతం పేరుగాంచింది. మామిడి, పామాయిల్, కోకో, కొబ్బరి, అరటి, నిమ్మ, సపోట, జీడిమామిడి, జామ, పండ్లతోటలు, కూరగాయలు పండించటానికి ఈ ప్రాంత నేలలు అనువుగా ఉంటాయి. దీంతో ఇక్కడ వాణిజ్య పంటల సాగును రైతులు తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం పామాయిల్, డ్రిప్, పందిరి కూరగాయల సాగుతోపాటు పలు ఉద్యానవన పంటలకు సబ్సిడీలతో ప్రోత్సహించింది. దీంతో రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపారు.
రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వినియోగం వల్ల వానపాములు చనిపోయి భూమిలో బలం లేకుండా పోతుందని రైతులు గ్రహించారు. ప్రకృతి ఎరువులను మాత్రమే వాడిన భూములు నేలకు తేమను ఉంచే శక్తి పెరిగి, పంటలకు పెట్టిన నీటి పరిమాణం తగ్గుతుంది. ఆవుపేడ, ఆవు మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం, కీటక నివారణి, తెగుళ్ల మందు, బీజామృతం తయారు చేసుకుని వినియోగించడం వల్ల భూమికి బలం చేకూరుతుందని ప్రకృతి ఎరువులు వినియోగిస్తున్న రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యావన పంటలకు ప్రకృతి వ్యవసాయంతో మంచి లాభాలు ఉంటాయని, కొద్దిగా కష్టపడితే ప్రకృతి వ్యవసాయంతో బంగారు పంటలు పండించవచ్చని వివరిస్తున్నారు.
గ్రామాల్లోని వీధుల వెంట ఉదయం, సాయంత్రం పశువుల పేడను సేకరించడం వల్ల వృద్ధులకు ఉపాధి కలుగుతున్నది. ఒక ట్రాక్టర్ పశువుల పేడను సేకరించి రైతుకు అమ్మితే రూ.2500 వస్తాయని నక్కా లక్ష్మి అనే వృద్ధురాలు తెలిపింది. ఏ పని చేతగాని తమలాంటి వాళ్లకి పశువుల పేడను సేకరించడం ద్వారా డబ్బులు వస్తున్నాయని తెలిపింది.
అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం రైతు మారిశెట్టి రామకృష్ణ తాను సాగు చేసిన నిమ్మ, జామ, అరటి, కోకో పంటలకు గోమూత్రం 20లీటర్లు, పాత బెల్లం 2 కిలోలు, శనగపిండి 2కిలోలు, ఆవుపేడ 15కిలోలు, పుట్టమన్ను 5కిలోలతో ఒక డ్రమ్ములో వేసి కలియ తిప్పి రెండు రోజులు మురగబెట్టి 1000 లీటర్ల నీటిలో 20 లీటర్ల ఈ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేస్తున్నట్లు వివరించారు. ప్రతి 20 లేక 30రోజులకు స్ప్రే చేయడం ద్వారా ఒక్కొక్క నిమ్మచెట్టుకు 500 పైన కాయలు ఉంటాయని, తన ఐదెకరాల తోటలో సుమారు 200 మొక్కలు ఉన్నాయని, ప్రతి ఏటా మొక్కలు ఎదిగినా కొద్ది మధ్య ఉన్న మొక్కలను తొలగిస్తామని పేర్కొన్నారు.
డ్రిప్ సౌకర్యం ఉందని కేవలం స్ప్రే చేసే సమయం, కాయలు కోసే సమయంలోనే కూలీల అవసరం ఉంటుందని వివరించారు. అన్ని ఖర్చులు పోను రూ1.50 లక్ష పైనే మిగులుతాయని, ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దేవరకొండ హరికృష్ణ చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ఉపరాష్ట్రపతి చేత సన్మానం పొందారు. పండువారిగూడెంలో 10మంది గిరిజన రైతులు వాసన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో చేస్తున్న వ్యవసాయ క్షేత్రలను ఐడీటీడీఏ, హైదరాబాద్ ఇక్రిశాట్ అధికారులు సందర్శించారు.