ఖమ్మం సిటీ, ఆగస్టు 29 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాణించిన క్రీడాకారులను సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను కొనియాడారు. విద్యార్థులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
క్రీడల వల్ల ఆరోగ్యం, మానసికోల్లాసం, సాంఘిక సౌబ్రాతృత్వం మరింత మెరుగవుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ క్రీడలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్నారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత 3కే రన్ నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ఇల్లెందు క్రాస్‌రోడ్, జిల్లా కోర్టు, ఇందిరానగర్ వరకు అక్కడి నుంచి జడ్పీ సెంటర్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీవైఎస్వో తుంబూరు సునీల్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, డీవైఎస్వో కార్యాలయ మేనేజర్ ఉదయ్‌కుమార్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు క్రిష్టోఫర్, కిసాన్ శ్రీను, బాలసాని విజయ్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్, ఇబ్రహీం, ఎన్ రాధాకృష్ణ, ఉప్పల్‌రెడ్డి, జే శ్రీనివాసరావు, వీ శ్రీనివాసరావు, గోవిందరెడ్డి, కోచ్‌లు ఎండీ గౌస్, పరిపూర్ణాచారి, కే సురేష్, వీ సాంబమూర్తి, పీ నగేష్, వై హరీష్, కే కొండల్రావు, శ్రీ కైలాష్ మహతో, నాగరాజు, సత్యం, దుర్గ పాల్గొన్నారు.