పినపాక, జనవరి 11: భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మౌరిటెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఐదు రోజులుగా జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ పోటీలు ముగిశాయి. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ పోరులో ఉత్తరప్రదేశ్ జట్టుపై రాజస్థాన్ జట్టు విజయం సాధించి జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. మరో మ్యాచ్‌లో హర్యానాపై అనూహ్యంగా గెలిచిన తెలంగాణ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 76 – 43 పాయింట్లతో తెలంగాణపై విజయం సాధించింది.
అలాగే, రాజస్థాన్ హర్యానా మధ్య జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లకు 25 – 25 చొప్పున సమాన పాయింట్లు రాగా ఫైవ్ రైడర్ మ్యాచ్‌తో రాజస్థాన్ 5 – 4 పాయింట్లతో హర్యానాపై విజయం సాధించింది. అలాగే.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లకు 28 – 28 చొప్పున సమాన పాయింట్లు రాగా ఫైవ్ రైడర్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 6 – 5 పాయింట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించి జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది. విజేతలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గెలుపు సర్టిఫికెట్లతో పాటు ఛాంపియన్ ట్రోఫీని అందజేశారు.
ఆదివారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లు సుమారు 6 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల జట్లలో ఎక్కువ వయసున్న క్రీడాకారులను ఆడిస్తున్నారని, అలాగే ఒకరి స్థానంలో మరొకరు ఆడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఎస్జీఎఫ్ అధికారులు మ్యాచ్‌లను నిలిపివేశారు. ఈ జట్ల క్రీడాకారులకు బయోమెట్రిక్ ద్వారా పరీక్షలు నిర్వహించారు.
కొందరు క్రీడాకారులు ఈ పరీక్షలలో పట్టుబడగా వారిని ఆటల నుంచి తొలగించారు. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండా కర్నాటక జట్టును డిస్ క్వాలిఫై చేశారు. దీంతో ఆ జట్టు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరలా తిరిగి మ్యాచ్‌లు ప్రారంభమవడానికి ఆరు గంటలు పట్టడంతో ఆటలను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. డీఈవో నాగలక్ష్మి, మణుగూరు డీఎస్పీ రవీందర్రావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, కంది చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు విశ్వభారత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.