రఘునాథపాలెం, నవంబర్ 22: అధునాతన కార్లు, సరికొత్త బైకుల ప్రదర్శన, విక్రయాలకు ఖమ్మం గుమ్మం వేదిక కానుంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు సంయుక్తంగా ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో వాహన సంస్థలన్నింటినీ ఒకేచోట చేర్చి శనివారం ఆటో షో నిర్వహించనున్నాయి. ఆయా కంపెనీలకు చెందిన అన్ని మోడల్ వాహనాలను ప్రదర్శనలో ఉంచనున్నాయి. దీంతో వాహనదారులు తమకు నచ్చిన వాహనం కొనుగోలు చేసుకునే చక్కటి అవకాశాన్ని కల్పించాయి. ఇప్పటివరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఆటో షో ‘నమస్తే తెలంగాణ’ రెండేళ్లుగా ఖమ్మం నగర ప్రజల చెంతకు చేరువ చేస్తున్న విషయం విదితమే.
సౌకర్యాలు, సదుపాయాలను ప్రత్యక్షంగా చూసుకొని, టెస్ట్ రైడ్ చేసుకొని మరీ కొనుగోలు చేసుకునే సదావకాశాన్ని ఈ ఆటో షో కల్పిస్తోంది. ఈ శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగే ఈ ఆటో షోను జిల్లా ప్రజలు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలు పలు వాహనాలపై పెద్ద మొత్తంగా అందించే రాయితీలనూ పొందొచ్చు.
నచ్చిన మోడల్ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన రుణ సౌకార్యాన్ని కల్పించేందుకు పలు బ్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది ఈ ఆటోషో. స్టాళ్లలోని బ్యాంకర్లు రుణం, వడ్డీ శాతం వంటివి తెలియజేస్తారు. ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాన్ని అందిస్తుందో బేరీజు వేసుకొని ఆ బ్యాంకు నుంచే వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఆటో షోకు వచ్చే సందర్శకులకు కూపన్లను అందించి లక్కీడిప్ ద్వారా బహుమతులను అందించనున్నారు.
ఈ షోలో మహావీర్ స్కోడా, ఆటోమోటివ్ కీయా, ప్రైడ్ జీప్, సిట్రోయెన్ ప్రైడ్ మోటార్స్, స్పార్క్ హీరో, టాటా మోటార్స్, కాకతీయ టయోటా, వెంకటరమణ బజాజ్, మహీంద్రా, కటకం హోండా, గ్రీన్‌హోండా సంస్థలు తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి. అలాగే, రుణ సౌకర్యం కల్పిచేందుకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, టీవీ పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్టనర్‌గా ఎస్ టీవీ వ్యవహరించనున్నాయి.