కారేపల్లి : నాగులచవితి సందర్భంగా శనివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న సింగరేణి (కారేపల్లి), కొనిజర్ల, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు మండలాలలో నాగులచవితిని మహిళలు ఘనంగా జరుపుకున్నారు. నాగుల చవితినాడు పుట్టలో పాలుపోస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సౌభాగ్యం కోసం, సంతానప్రాప్తి కోసం సర్పపూజ చేయడం అనే సంప్రదాయం అనాదిగా వస్తున్నది.
కుజ, రాహు దోషాలున్నవారికి, సంసారిక బాధలున్నవారికి శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. నాగుల చవితినాడు మహిళలు మంగళ స్నానమాచరించి పుట్టలో పాలుపోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణాలు, గ్రామాలలోగల పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతమంది ఇంట్లో నాగదేవత విగ్రహం పెట్టి పూజలు చేస్తారు.
కానీ కొన్ని ప్రదేశాలలో భక్తులు పాము పుట్ట వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించి, పూజలు చేసి పాలు పోస్తారు. నాగుల చవితి సందర్భంగా కొందరు మహిళలు ఉపవాసం ఉండి నాగపూజ చేస్తారు. తమ సంతానం క్షేమంగా ఉండాలని మహిళలు నాగదేవతను కోరుకుంటారు. పాలు, కుంకుమ, పసుపు, విభూది, బెల్లం, నల్ల నువ్వుల మిశ్రమంతో చేసిన తీపి పదార్ధాలను పుట్టల వద్ద నైవేద్యంగా ఉంచుతారు.
అలాగే కొంతమంది గుడ్లను కూడా పుట్ట వద్ద పెడుతారు. నాగదేవత పుట్టపై పసుపు, కుంకుమ వేసి పూలు సమర్పిస్తారు. దీపం వెలిగించి తమతో తెచ్చుకున్న నైవేద్యాన్ని పుట్ట వద్ద ఉంచుతారు. పూజ అనంతరం కొంచెం పుట్టమన్నును తీసుకుని వెళ్తారు. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోతాయని, ఆరోగ్యంవంతులవుతారని భక్తుల విశ్వాసం.