కారేపల్లి, ఆగస్టు 3: ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్), లింగం బంజర గ్రామాల ప్రజలు, మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు (Bonalu) నిర్వహించారు. కారేపల్లి క్రాస్ రోడ్‌కు చెందిన మహిళలు బోనాలు ఎత్తుకొని ముందుగా గ్రామ దేవత అయిన ఎర్రమ్మ తల్లికి పూజలు చేశారు. డప్పువాయిద్యాలతో లింగం బంజరలోని నాభిశిల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనంతరం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు సమర్పించారు. గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించి ముత్యాలమ్మ తల్లికి పసుపు, కుంకుమలతో చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల పెద్దలతో పాటు మహిళలు పాల్గొన్నారు.