 
                                                            మధిర, అక్టోబర్ 29 : వరద ఉధృతి నుంచి తమను కాపాడాలని కోరుతూ మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీవాసులు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మధిర-వైరా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మధిర డివిజన్ రైతు సంఘం అధ్యక్షుడు పాపినేని రామనర్సయ్య మాట్లాడుతూ ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వర్షాలు వచ్చినప్పుడు అధికారులు కన్నెత్తి చూడడం లేదని, అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ కాలనీకి ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. కాగా.. ఆందోళన వద్దకు చేరుకున్న మధిర పట్టణ సీఐ రమేశ్, తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో శీలం నరసింహారావు, పడకంటి మురళి, మందా సైదులు, మధు పాల్గొన్నారు.
 
                            