ఖమ్మం రూరల్, జూన్ 05 : పచ్చిరొట్ట ఎరువులతో సాగు రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సాగు రైతులకు పచ్చి రొట్ట ఎరువుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ మండల వ్యవసాయ శాఖ అధికారి ఉమా నాగేష్, ఇతర పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులతో కలిసి ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూమిలో సారాన్ని పెంచేందుకు రసాయనక ఎరువుల వాడకం తగ్గించేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గి పంట దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పచ్చి రొట్టె ఎరువులు కొనుగోలు చేసి భూములలో వేసుకోవాలని ఆయన సూచించారు.
వేసవికాలం ముగిసిన తర్వాత పంట వ్యర్ధాలను పంట పొలాల్లో కాల్చివేయొద్దని తద్వారా పర్యావరణం దెబ్బతినడంతో పాటు భూసారం గణనీయంగా తగ్గిపోతుందన్నారు. సాగు రైతులకు తమ సొసైటీ ద్వారా పంట రుణాలు అందించడంతో పాటు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుందని సొసైటీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. భూమిలో తేమ శాతాన్ని గమనించి పత్తి ఇతర విత్తనాలను నాటుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి కావ్య, పాలకవర్గ సభ్యులు మద్ది కళింగారెడ్డి, మట్టా శ్రీకాంత్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.