భద్రాచలం, డిసెంబర్ 3: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు వేళైంది. ఈ నెల 13 నుంచి జనవరి 2 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మధుకైటభులు అనే రాక్షసులను శ్రీమన్నారాయణుడు సంహరించి, ఈ వైకుంఠ ఏకాదశి రోజునే వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుంచి ముక్తిని ప్రసాదించాడని పురాణ గాధ. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన 12 మంది ఆళ్వారులలో ఒకరైన పెరియాళ్వార్ శ్రీభూనీలా సమేతుడై గరుఢ వాహనంపై ఉన్న శ్రీమన్నారాయణుడి వైకుంఠ ఏకాదశి నాడు ఆకాశంలో ఉత్తరం వైపున దర్శించాడని చరిత్ర. ఈ కారణంగానే ఏకాదశి పర్వదినాన్ని మధ్య మణిపూసగా చేసుకొని ముందు పది రోజులు ‘పగల్పత్తు’ ఉత్సవాలు, వెనుక పది రోజులు ‘రాపత్తు’ ఉత్సవాలుగా నిర్వహిస్తారు. మొత్తం 21 రోజులపాటు ఎంతో వైభవంగా శ్రీ పాంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. ఇప్పటికే ఆలయానికి రంగులు, చలువ పందిళ్లు, తెప్పోత్సవం నిర్వహించేందుకు హంస వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.
అలాగే, పట్టణానికి నాలుగు వైపులా స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా చిన్న చిన్న హంస చిత్రపటాలను స్వాగత ద్వారాలకు అమర్చుతున్నారు. ఈ నెల 13న పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 14న కూర్మావతారం, 15న వరాహావతారం, 16న నారసింహా, 17న వామన, 18న పరుశురామ, 19న శ్రీరామావతారం, 20న బలరామావతారం, 21న శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దీంతో పగల్పత్తు ఉత్సవాలు ముగుస్తాయి. 22న అంగరంగ వైభవంగా అలంకరించిన హంసవాహనంపై సీతారామ, లక్ష్మణమూర్తులు జలవిహారం చేయనున్నారు. 23న ఎంతో మంది భక్తులు ఎంతో ఆత్రతగా ఎదురు చూసే వైకుంఠ ద్వారా దర్శనం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. అనంతరం 30న కల్కీ అవతారంతో రామయ్యకు భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 8న ఆలయం ప్రాంగణంలో సకల దేవతలను కొలువదీర్చి నేత్రపర్వంగా విశ్వరూప సేవ జరుపుతారు.