భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : నిన్న మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ప్రక్రియను సిద్ధం చేశారు. శనివారం ఆ జాబితా డ్రాఫ్ట్‌ను జడ్పీ అధికారులు విడుదల చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే అని పంచాయతీరాజ్ అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే ఓటర్ల జాబితా డ్రాప్ట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. శనివారం డ్రాఫ్ట్ విడుదల చేయగా ఈ నెల 8వ తేదీన మండల స్థాయి, జిల్లా స్థాయి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఆరో తేదీ నుంచి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కూడా తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల డ్రాఫ్ట్ విడుదల చేసిన దానిలో ఇప్పటివరకు జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అభ్యంతరాల తర్వాత మరికొంతమంది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 3,25,045 మంది ఉండగా, మహిళా ఓటర్లు 3,453,978 మంది ఉన్నారు. ఇతరులు 24మంది ఉన్నారు. జిల్లాలో 22 మండలాల్లో జడ్పీటీసీలు ఉండగా, ఎంపీటీసీలు 233ఉంది ఉండనున్నారు. ఇందులో ఎన్నికల నిర్వహణకు 1,271 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. జడ్పీసీఈవో నాగలక్ష్మి డ్రాఫ్ట్‌ను జిల్లా పరిషత్ కార్యాలయం నోటీస్ బోర్డులో ప్రదర్శించారు.