ఖమ్మం, సెప్టెంబర్ 14 : రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మున్నూరుకాపులు, బీసీలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ట్రస్ట్ ఆఫ్ పటేల్స్(టాప్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో మున్నూరుకాపులు, బీసీలకు స్థానం లభించాలని కోరుకున్నారు. దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నతంగా ఎదిగిన మున్నూరుకాపుల నుంచి నిధులు సేకరించి సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమావేశంలో మున్నూరు కాపు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.