ఖమ్మం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భవిష్యత్ బీఆర్ఎస్దేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను, అధినేత కేసీఆర్‌ను వీడిన నేతలు పశ్చాత్తాప్పపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయశక్తిగా ప్రజల హృదయాల్లో నిలవనుందని అన్నారు. తనను సొంతబిడ్డలా చూసుకుంటూ అద్భుతమైన రాజకీయ అవకాశాలు ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితకాలమంతా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చిచెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా గురువారం ఢిల్లీలో ఆయన రెండోదఫా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా రాష్ర్టాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు చేయాల్సిన కృషిపై ఆయన ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
నమస్తే తెలంగాణ : రాజ్యసభ సభ్యుడిగా మీ ప్రాధాన్యాలేంటి?
వద్దిరాజు : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో రెండోసారి కూడా రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉంది. మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా 20 నెలలపాటు గడించిన అనుభవం భవిష్యత్ పోరాటానికి ఉపయోగిస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం నుంచి రావాల్సిన వాటిని తెచ్చేందుకు కృషిచేయడమే నా ప్రథమ కర్తవ్యం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి, కేంద్ర పథకాల ద్వారా నిధులు సాధించడానికి నిరంతరం శ్రమిస్తా.
నమస్తే : కేంద్రం పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలేమిటి?
వద్దిరాజు : రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి ప్రధాన సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోలేదు. వచ్చే ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పక్షాన ఒత్తిడి తెచ్చి వాటిని నెరవేర్చి వేలాదిమందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించి పోరాడుతాం.
నమస్తే : పారిశ్రామిక ప్రగతికి కేంద్రం ద్వారా చేసే కృషి ఏమిటి?
వద్దిరాజు : అభివృద్ధి జరుగుతున్న తెలంగాణలో జలరవాణాకు అవకాశం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర నలుమూలల డ్రైపోర్టులను ఏర్పాటు చేయాలన్నది నా ఆకాంక్ష. దీనిపై 20 నెలల పదవీకాలంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశా. వివిధ రూపాల్లో డ్రైపోర్టుల అవసరాన్ని తెలియచేశా. భవిష్యత్‌లో వీటి సాధన కోసం రాజ్యసభ, లోక్‌సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తుతారు.
నమస్తే :ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యాచరణ ఏమిటి?
వద్దిరాజు :బీఆర్ఎస్ అంటే బలహీన, బడుగు వర్గాల, మైనార్టీల పార్టీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వారి అభివృద్ధికి ఆయన ప్రభుత్వం నిరంతరం శ్రమించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు కొంత భిన్నంగా ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు ఏంకావాలో, గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో ఇంటింటికీ వెళ్లి చెప్పేందుకు బీఆర్ఎస్ సైన్యం సిద్ధమవుతోంది.
నమస్తే : రెండోసారి రాజ్యసభ అవకాశం పై మీ స్పందన?
వద్దిరాజు :రాజ్యసభ సభ్యుడిగా తనకు రెండోసారి అవకాశం ఇవ్వడం తండ్రిలాంటి కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. తనకు ఈ స్థానం ఇవ్వడం ద్వారా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలలను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటారన్న విషయాన్ని, వారి కోసం బీఆర్ఎస్ పార్టీ ఉందన్న సందేశాన్ని ప్రజలకు పంపించగలిగారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలన్నీ ఎప్పటికీ కేసీఆర్ వెంటే నడుస్తాయి.
నమస్తే : ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ విజయం కోసం మీరు నిర్వహించే పాత్ర?
వద్దిరాజు : రాజకీయ చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తా. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీకి పూర్తి సానుకూల వాతావరణం ఉంది. ఎవరెన్ని వ్యూహాలు రూపొందించినా ఇక్కడ అంతిమ విజయం బీఆర్ఎస్దే. గతంలో గెలిచినట్లుగా భారీ మెజార్టీతో మళ్లీ గెలుస్తాం. విజయదుందుభి ఖాయం.
నమస్తే : మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
వద్దిరాజు : రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఉండటం, పార్టీ పురోభివృద్ధికి సైనికుడిలా కష్టపడటం నా తక్షణ కర్తవ్యం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కేసీఆర్ వేలు విడిచిపెట్టేదిలేదు. బీఆర్ఎస్ను రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి తీసుకురావడమే నా అంతిమ లక్ష్యం. ఇదే నా కార్యాచరణ.