వైరాటౌన్, అక్టోబర్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కులస్థులకు సబ్సిడీపై సంక్షేమ పథకాలు అందిస్తుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శనివారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గీత కార్మికులకు రక్షణ కవచం కిట్లను ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ అందజేశారు.
గీత కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు సబ్సిడీపై రుణాలు, యంత్ర పరికరాలు అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపర్టెండెంట్ జనార్ధన్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పలు శాఖల అధికారులు, గీత కార్మికులు, పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను ఎంపీ, ఎమ్మెల్యే వైరా రిజర్వాయర్‌లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను కొనుగోలు చేసి వందశాతం రాయితీపై అందజేస్తుందన్నారు. వైరా రిజర్వాయర్‌లో 14లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మున్సిపాల్ చైర్మన్ సూతకాని జైపాల్, మత్స్య సొసైటీ చైర్మన్ రహీం, జిల్లా కన్వీనర్ మామిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైస్ చైర్మన్ సీతారాములు, మున్సిపాల్ కమిషనర్ వేణు, సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సత్తుపల్లిటౌన్, అక్టోబర్ 19: బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే గౌడ కులస్తుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి అధ్యక్షతన జరిగిన రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో వంద మంది గీత కార్మికులకు రక్షణ కవచాలు అందించామని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 216 మంది లబ్ధిదారులకు రూ.61, 26,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆశ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో 25 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థినులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున నగదు ప్రోత్సాహాలను ఆశ స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు దయానంద్, ఎంపీ రఘురాంరెడ్డి అందించారు.