రఘునాథపాలెం, ఫిబ్రవరి 28: రవాణా వాహనాలపై ఉన్న త్రైమాసిక పెండింగ్ పన్నులను తక్షణమే చెల్లించాలని జిల్లా రవాణాశాఖాధికారి తోట కిషన్‌రావు వాహనదారులకు సూచించారు. మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 8,480రవాణా వాహనాలు త్రైమాసిక పనులు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్నాయన్నారు. ఆయా వాహనాల ద్వారా రూ.8.63కోట్లు పన్నుల రూపంలో రావాణాశాఖకు రావాల్సి ఉందన్నారు. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి త్రైమాసిక పన్నులు చెల్లించని రవాణా వాహనాలపై అదనంగా 200 నుంచి 300శాతం వరకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు గమనించి పెండింగ్‌లో ఉన్న త్రైమాసిక పన్నులను తక్షణం చెల్లించాలన్నారు. సమావేశంలో మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు వరప్రసాద్, శంకర్ పాల్గొన్నారు.