రఘునాథపాలెం, జనవరి 27 : మండలంలోని వి.వెంకటాయపాలెం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కూరాకుల నాగభూషణంపై శనివారం సొసైటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైర్మన్‌పై ఆ సంఘం డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోరుతూ ఈ నెల 11వ తేదీన డీసీసీబీ అధికారులకు వినతిపత్రం అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా..13 మంది డైరెక్టర్లకు.. 11 మంది హాజరయ్యారు. సొసైటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తూ.. డీసీసీబీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కూరాకుల నాగభూషణంతోపాటు ఆయనకు అనుకూలమైన మరో డైరెక్టర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో ఒక వర్గానికి చెందిన 11 మంది డైరెక్టర్లు.. చైర్మన్ నాగభూషణంపై విశ్వాసం లేదని ప్రకటించారు. కానీ.. సమావేశం నిర్వహించిన డీసీవో విజయకుమారి మాత్రం ఫలితాన్ని ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న ఫలితం వెల్లడికానున్నట్లు తెలిపారు. అయితే సమావేశంలో పాల్గొన్న 11 మంది డైరెక్టర్లు తామే అవిశ్వాస తీర్మానంలో నెగ్గినట్లుగా ప్రకటించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై కొండల్రావు ఆధ్వర్యంలో వీ వెంకటాయపాలెం సొసైటీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అవిశ్వాస సమావేశంలో ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, చావా నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం, నల్లమల ఆనంద్, పోట్ల వీరేందర్, సంక్రాంతి నాగేశ్వరరావు, బండి వెంకన్న, తమ్మిన్ని నాగేశ్వరరావు, కొత్తా కొమరయ్య పాల్గొన్నారు.