రామవరం, డిసెంబర్ 5 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశారు.. పలుమార్లు జైలుజీవితం గడిపారు కొత్తగూడెం పట్టణంలోని రామవరానికి చెందిన మోరె భాస్కర్‌రావు. ఒకానొక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో పలువురు ఉద్యమకారులు అడ్డుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడుతాయని విస్తృతంగా ప్రచారం చేశారు. రామవరం ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న సాధన గ్రౌండ్‌ను కొందరు వ్యక్తులు ప్లాట్లు చేసి విక్రయించే ప్రయత్నం చేస్తుండగా.. వారి ఎత్తులను చిత్తు చేశారు. గ్రౌండ్ ఏర్పాటులో ఆయన పాత్ర మరువలేనిదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ మైదానానికి ఆయన పేరు పెట్టాలని తీర్మానం కూడా చేశారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా, జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యుడిగా, టీఆర్ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, టీఆర్ఎస్ కొత్తగూడెం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు గెలుపునకు ఎనలేని కృషి చేశారు. రామవరం 9వ వార్డులో ఎంబీఆర్ యూత్ ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు.