రఘునాథపాలెం, జూలై 12 : ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం కొంత చల్లగానే ఉంది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం నగరంతోపాటు రఘునాథపాలెం, వైరా, కామేపల్లి, కూసుమంచి, ఖమ్మంరూరల్ మండలాల్లో వర్షం కురిసింది. ఖమ్మం నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాలు వేయగా మొలకెత్తిన గింజలకు కురిసిన వర్షం ఉపయోగపడుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వానకాలం ఖమ్మంజిల్లాలో ఇప్పటివరకు సరైన వర్షం కురవలేదని, చెరువులు మత్తడి దుంకేలా, బావులు నిండే వానలు పడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరంలో శనివారం కురిసిన వర్షంతో డ్రైనేజీలు నిండి రోడ్లపై ప్రవహించాయి. పాదచారులు, ద్విచక్రవాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.