అశ్వారావుపేట/ కరకగూడెం/ చర్ల/ జూలూరుపాడు, జూన్ 2: పొద్దంతా భానుడి భగభగలతో విలవిలలాడిన ప్రజలు మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. సాయంత్రం నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని జిల్లాలోని అశ్వారావుపేట, కరకగూడెం, చర్ల, జూలూరుపాడు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పైకప్పులు లేచిపోవడంతోపాటు భారీ వృక్షాలు నేలకూలాయి.
విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చర్ల మండలంలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయ హాస్టల్ ఎదుట ఉన్న తాటి చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. దండుపేటలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సీఆర్ కాలనీలో ఇండ్ల పైకప్పులు లేచిపోయి ఇండ్లు నేలమట్టమయ్యాయి. అశ్వారావుపేట పట్టణంలో వర్షం దంచికొట్టింది. జూలూరుపాడు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఉరుములు, ఈదురు గాలులతో వర్షం కురిసింది.
పడమట నర్సాపురం, కొమ్మగూడెం, కాకర్ల, గుండెపుడి, అనంతారం, వినోభానగర్ తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కరకగూడెం మండలం శ్రీరంగాపురంలో ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇదే గ్రామంలో భారీ వృక్షం కూకటి వేళ్లతో నేలకూలింది. రేగుళ్ల గ్రామంలో మామిడి చెట్టు కూలడంతో దాని కిందే ఉన్న రెండు ట్రాక్టర్ల ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది.

