ఖమ్మం, జూలై 27 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారు. జీవన్‌రెడ్డి తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వాస్తవమని నిరూపిస్తే జీవన్‌రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రవేశపెట్టినదానిలా లేదని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రూ.80 వేల కోట్లు అందించిందంటూ ప్రకటించి పరోక్షంగానైనా ఒప్పుకుందన్నారు. పక్క రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పింఛన్ స్కీంలను పెంచారు. మరి తెలంగాణలో ఆయన శిష్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పింఛన్‌ను ఎప్పుడు పెంచుతారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై తూతూమంత్రంగా చర్యలు చేపడుతోందని, డ్రగ్స్ బారినపడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో నాడు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా గుడుంబా, సారా పూర్తిగా నిర్మూలన జరిగిందని గుర్తుచేశారు.