ఖమ్మం, అగస్టు 15 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో గత కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించి ఎందరో త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నామని అన్నారు.
భారత రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రపంచానికి అత్యంత విలువైన రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఫలాలు అన్ని వర్గాలకు చేరాలంటే ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉండాలని, రాజ్యాంగం ద్వారా హకులు కల్పించాలని గుర్తు చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగానికి అనుగుణంగా 14 ఏళ్లపాటు పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయకుమార్, మారెట్ మాజీ చైర్ పర్సన్ దొరేపల్లి శ్వేత, జిల్లా గ్రానైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉద్యమకారుడు ఉప్పల వెంకటరమణ, జిల్లా నాయకులు పొట్ల శ్రీను, మహ్మద్ రఫీ, భారతమ్మ, కిరణ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, చింతకాని మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు వీరన్న, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, లింగనబోయిన సతీష్, కోడిరెక ఉమా శంకర్, ఆసిఫ్, బురాన్, గ్లోరీ, గొట్టిముకల శ్రీను, దరిపెల్లి వీరబాబు, నాగుల్ మీరా, రాంబాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.