తిరుమలాయపాలెం, అక్టోబర్ 16: అక్రమ కేసులకు తమ పార్టీ క్యాడర్ భయపడబోదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నేతల అక్రమ కేసుల వల్ల జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్నను, పార్టీ కార్యకర్తలను మండలంలోని జల్లేపల్లిలో బుధవారం ఆయన కలుసుకున్నారు. జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి వెళ్లి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో తాతా మధు మాట్లాడారు. మండల ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్నపై.. స్థానిక మంత్రి, కాంగ్రెస్ నేతలు అక్రమ కేసులు బనాయించారని, జైలుకు పంపారని ఆరోపించారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన తిరుమలాయపాలెం బిడ్డలు అక్రమ కేసులకు భయపడబోరని స్పష్టం చేశారు.
ఖమ్మంలో మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఇంటూరి శేఖర్ వంటి వారిపై కూడా తప్పులు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టాలంటూ పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని కోరారు. దానిని మీరితే గుణపాఠం తప్పదని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ ఎన్నికల హామీలను అమలు చేయలేక చతికిలబడిందని విమర్శించారు.
భవిష్యత్ బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం, బాషబోయిన వీరన్న, అతడి సతీమణి, మాజీ సర్పంచ్ శైలజ, వారి కుటుంబ సభ్యులకు, జైలుకు వెళ్లి వచ్చిన పార్టీ కార్యకర్తలకు తాతా మధు, లింగాల కమల్‌రాజు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తిరుమలరావు, సుబ్బారావు, రమణ, శంకర్రావు, చావా వేణు, చామకూరి రాజు, కొండబాల వెంకటేశ్వర్లు, మంచానాయక్, వెంకటరెడ్డి, శ్రీను, వెంకన్న, యాదగిరి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, రవీందర్, వెంకటేశ్వర్లు, జగదీశ్, చందు పాల్గొన్నారు.