జూలూరుపాడు, జూలై 17 : రాష్ట్రం రాబందుల పాలు కాకుండా రైతులు కాపాడుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చించాలని కోరారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం – మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో పది రోజులపాటు జరుగనున్న నిరసనలో భాగంగా మండలంలోని పడమటనర్సాపురం రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి రాష్ర్ట సర్కారు అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, అన్నదాతలను మోసం చేసి అధికారం చేపట్టాలని పగటి కలలు కంటుందని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తానంటున్న మూడు గంటల కరెంట్ కావాలో, బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు పంటలకూ ఇస్తున్న నిరంత ఉచిత విద్యుత్ కావాలో అన్నదాతలు ఆలోచించాలని కోరారు.
అనంతరం వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. సుభిక్షంగా పాడిపంటలతో అలరారుతున్న తెలంగాణ రైతుల నోట్లో మన్నుకొట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ వెంటనే ఉపసంహరించుకొని యావత్ తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకి వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అన్నదాతల మేలు కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఈ సభలో రాష్ర్ట సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సభకు వచ్చిన రైతులు హర్ష ధ్వానాల మధ్య తీర్మానాన్ని ఆమోదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కట్రం మోహన్‌రావు, లావుడ్యా సోని, మంగీలాల్, యదళ్లపల్లి వీరభద్రం, యల్లంకి సత్యనారాయణ, వేల్పుల నర్సింహారావు, పొన్నెకంటి సతీశ్‌కుమార్, చౌడం నర్సింహారావు, నున్నా రంగారావు, మోదుగు రామకృష్ణ, రామిశెట్టి నాగేశ్వరరావు, రోకటి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.