ముదిగొండ, జనవరి 23 : అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారినే ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని, అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పథకాలు అందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని, అందరి సమక్షంలో అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ చెబుతున్నందున, ప్రతీ లబ్ధిదారునికి పథకాలు అందేలా చూడాలన్నారు.
కొందరు అధికారులు కార్యాలయంలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. వెంచర్లు, సేద్యం కాని భూములకు రైతు భరోసా నిలిపివేయండి.. కానీ రాజకీయ కారణాలతో ఆపొద్దన్నారు. రాష్ట్రంలో 96 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. మరో పది లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో స్పష్టత ఇవ్వాలని, భూమిలేని నిరుపేదలకు ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ నిరుపేదకు పథకాలు వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎంపీడీవో శ్రీధర్స్వామి, ఏఈవో మౌనిక, బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, బంక మల్లయ్య, సామినేని హరిప్రసాద్, ధర్మారావు పాల్గొన్నారు.