ఖమ్మం/మణుగూరు టౌన్, డిసెంబర్ 16: లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని ఆ పార్టీ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలు, రైతులకు తెలియజేసేలా కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి అజయ్ పిలుపుమేరకు ఖమ్మం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మరో ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాల్లో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు వినతులు సమర్పించాలని పార్టీ శ్రేణులను రేగా కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజా ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని తాతా మధు పిలుపునిచ్చారు.