Khammam | కారేపల్లి (ఖమ్మం), డిసెంబర్ 7 : ఖమ్మం నగరం ఎస్ఆర్, బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం స్టాళ్ల ప్రదర్శన మాత్రమే కాదని, ఇది ఖమ్మం రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుత స్థితిని, నగర అభివృద్ధి దిశను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ద్వారా ఖమ్మం నగరం రూపురేఖలు ఏ విధంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఖమ్మం ప్రజల గృహ అవసరాలకు అనుగుణంగా, నిర్మాణం ప్రారంభ దశ నుంచి తుది దశ వరకు అవసరమయ్యే వివిధ రకాల ఉత్పత్తులు, సాంకేతికతలు ఇక్కడ ప్రదర్శించారన్నారు.
బిల్డర్లు, డెవలపర్లతో పాటు, వారికి కావాల్సిన టెక్నాలజీని, నిర్మాణ సామగ్రిని సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషమని కొనియాడారు. ఈ ప్రదర్శనలో నాణ్యతతో కూడిన నిర్మాణ వస్తువులు, భద్రతను పెంపొందించే అత్యాధునిక ఎక్విప్మెంట్, వైరింగ్ సొల్యూషన్స్ వంటివి దృష్టిని ఆకర్షించాయన్నారు. ఈ ప్రదర్శన చూసి తాను వ్యక్తిగతంగా చాలా ఇంప్రెస్ అయ్యానని ఆయన తెలిపారు. ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తూ, తమ వ్యాపారాలను విస్తరిస్తున్న అన్ని కంపెనీల యజమానులు, నిర్వాహకులు మరింతగా రాణించాలని తాతా మధుసూదన్ ఆకాంక్షించారు. ఈ విజయవంతమైన క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహణకు కృషి చేసిన నిర్వాహక కమిటీ సభ్యులు బండి కిషోర్, వేముల కిరణ్, వెంకటేశ్వరరావు, సురేష్, నగేష్, ప్రసాద్, చావా రాము, వినయ్ చౌదరి సహా అందరినీ ఆయన అభినందించారు. కార్యక్రమంలో అమర్, ముత్యాల వెంకటప్పారావు, దొండేటి అశ్వినీ కుమార్ పాల్గొన్నారు.