ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఉన్న జిల్లా జైలులో బేతంపూడి సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్, ఎస్టీ సెల్ నాయకుడు భూక్యా రాజును శనివారం కవిత పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి జైలులో ములాఖత్ ద్వారా వారిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
టేకులపల్లి మండలానికి చెందిన నాయకుడు లక్కినేని సురేందర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి 12 రోజుల నుంచి జైలులో పెట్టిందన్నారు. కారణం లేకుండా ప్రజా నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్టీ, ఎస్సీ చట్టాన్ని సైతం దుర్వినియోగం చేస్తూ కేసులు బనాయిస్తున్నారన్నారు. కేసీఆర్‌ను, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కాదని కాంగ్రెస్ సర్కార్ తెలుసుకోవాలన్నారు. ఒక్కరిద్దరిని జైలులో పెట్టవచ్చు కానీ, ప్రశ్నించడం మాత్రం ఆపలేరని స్పష్టంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయని, రైతుబంధు రాని రైతులు, రేషన్‌కార్డులు రాని లబ్ధిదారులు, ఉద్యోగాలు రాని యువకులు ఈ కాంగ్రెస్ మాటలు ఒట్టివేనని గ్రహించారని అన్నారు.
14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ర్టానికి ఏమీ వెలగబెట్టింది లేదని ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. ఆ భయంతోనే ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఏమి తప్పుచేశారని సురేందర్‌ను జైలుపాలు చేశారని ప్రశ్నించారు. గ్రామసభలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాడని అన్నారు. ఇకపైనా కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు. పాలన చేతకాక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చే వరకు వెంటపెడుతామన్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నాయకత్వం సురేందర్‌కు మద్దతుగా నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో ఏమూలన, ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఇదే తీరుగా అండగా నిలబడి కాపాడుకుంటామన్నారు. కేసులకు భయపడేదిలేదని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దాష్టీకాలను తెలంగాణ సమాజం గమనించాలన్నారు.