ఖమ్మం: స్ధానిక సంస్ధల శాసన మండలి ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కల్లూరు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓటర్లకు శానిటేషన్, జ్వర పరీక్షలను నిర్వహించిన తర్వాతనే పోలింగ్ కేంద్రంలోని అనుమతి ఇచ్చారు.
ఖమ్మం ఆర్డిఓ కార్యాలయంలో మొత్తం ఓటర్లు 348 మందికి గానూ 326 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 143 మందికి గానూ 135 మంది మహిళలు 205 మందికి గానూ 201 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ పోలింగ్ కేంద్రంలో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం కార్పొరేషన్ రఘునాథపాలెం మండలం ఓటర్లు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, మధిర నియోజకవర్గంలో ముదిగొండ, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, వైరా నియోజకవర్గంలో వైరా, కొణిజర్ల, కామేపల్లి ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, ఇల్లందు మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు ఖమ్మం కార్పోరేషన్‌కు చెందిన కార్పోరేటర్లు మధిర, వైరా మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఎన్నికల పరిశీలకు సి.సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్‌లు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.