ఖమ్మం, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. గురువారం ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతిన ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. జిల్లాలో 93.05 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 4,089 మంది ఓటర్లకుగాను.. 3,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలో పోలింగ్ సరళిని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం ఓట్లు 4,089 ఉండగా.. వాటిల్లో కేవలం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాల కేంద్రంలోనే 1,986కి పైగా ఓట్లు ఉన్నాయి. అందుకని ఈ కేంద్రాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రక్రియను, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ తనిఖీ చేసిన తర్వాత అదే కేంద్రాన్ని సీపీ సునీల్ దత్ కూడా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఖమ్మం అదనపు డీసీపీ ప్రసాదరావు, నగర ఏసీపీ రమణమూర్తి కూడా పలు కేంద్రాలను పరిశీలించారు.
ఉదయం నుంచే ఉత్సాహంగా మొదలైన పోలింగ్.. చివరి సమయంలో ఇంకా ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత టీచర్లు ఓటు హక్కు ఎక్కువగా వినియోగించుకున్నారు. అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు 54 శాతం పోలింగ్ జరగ్గా.. సాయంత్రం 4 గంటల వరకు 93.05 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 10 గంటలకు 20.35 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 54.34 శాతం, మధ్యాహ్నం 2 గంటలకు 79.53 శాతం, సాయంత్రం 4 గంటలకు 93.05 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, కౌంటింగ్ ప్రక్రియ నల్లగొండలో ఉన్నందున ఇక్కడ ఎన్నికలు పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్(ఆర్సీ)కి పంపించారు.
ఖమ్మం రిక్కాబజార్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పార్టీ గుర్తులు, పార్టీ ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డికి అనుకూలంగా పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారని యూటీఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం నిర్వహించకుండా పోలీసులు వారిని పంపించివేశారు. దీనిపై ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. అయితే, పోలీసులు కొందరికి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పోలీసు వాహనం ఎదుట బైఠాయించారు. కొంతసేపు ఆందోళన చేశాక పోలీసులు సర్దిచెప్పి పంపించారు.