పాల్వంచ, జనవరి14 : ఖమ్మం నిర్వహించే బీఆర్ఎస్ సభ దేశానికి దిక్సూచిగా నిలవనున్నదని, ఈ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారన్నారు. శనివారం పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో ఆయనతో కలిసి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దేశంలో ఏరాష్ట్రం లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇలాంటి తరుణంలో దేశానికి కేసీఆర్ ఎంతో అవసరమన్నారు. తెలంగాణలో తాగు, సాగునీరుతోపాటు 24 గంటలపాటు కరెంటు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతున్నదని, ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ర్టాలకు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. ఉద్యమాల గడ్డ ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ సభను సక్సెస్ చేద్దాం
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను సమష్టిగా సక్సెస్ చేద్దామని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభకు ఐదు రాష్ర్టాల ముఖ్యమంత్రులతోపాటు మాజీ సీఎంలు, సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు, ఇతర పార్టీల నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 20 వేల మంది తరలించాలని, బహిరంగసభకు ఇక్కడి నుంచి ఉదయం 9 గంటలకే బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. నియోజకవర్గంలో కేటాయించిన ప్రదేశాలకు 17వ తేదీన వాహనాలు చేరుకుంటాయన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ బాధ్యతలు తీసుకుని ఆయా వాహనాల్లో ప్రజలను ఎక్కించి బహిరంగ సభకు తీసుకుని రావాలని కోరారు. సమావేశంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్మన్ కాపు సీతామహలక్ష్మి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, రైతు సమన్యయ కమిటీ అధ్యక్షుడు కిలారు నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భూక్యా రాంబాబు, ఎంపీపీ భూక్యా సోనా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు రజాక్, వెంకట్, హనుమంతరావు, రామలింగం, అన్వర్‌పాషా, కనకేష్, వెంకటేశ్వర్లు, ఉమర్, విశ్వనాథం, శ్రీరామ్మూర్తి, మోహన్‌రావు, పరంజ్యోతిరావు తదితరులు పాల్గొన్నారు.