లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 27 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ గెలుపునకు కారణం అవుతాయని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని హేమచంద్రాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవచేయడమే నా లక్ష్యం అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం పేద రైతులకు ధీమాగా మారిందన్నారు. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యేకు మహిళలు హారతిచ్చి స్వాగతం పలికారు. ప్రచారంలో యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.