భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం కేసీఆర్ను బలహీన పర్చాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితకు ఈడీతో నోటీసులు పంపిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. కొత్తగూడెం రైటర్బస్తీలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగానీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అబాసుపాలు చేయాలనుకుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ సగటు మహిళకు కనీస గౌరవం లేకుండా ఈడీ నోటీసులు పంపిస్తారా? అని మండిపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని స్పష్టం చేశారు.
తెలంగాణను పోరాడి సాధించిన కేసీఆర్పై కుట్రలు చేస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, కాపు సీతాలక్ష్మి, దామోదర్, మండే వీరహనుమంతురావు, రాంబాబు, జగన్, శాంతి, కొట్టి వెంకటేశ్వర్లు, సంకు భావనా అనుదీప్, అనూష, పద్మ, రజాక్, కేకే, వాసు, మసూద్, యూసూఫ్ పాల్గొన్నారు.