సత్తుపల్లి రూరల్, ఫిబ్రవరి 20 : గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ప్రజలకు కావాల్సిన ఫలాలను అందించడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం రేజర్ల గ్రామంలో సింగరేణి సహకారంతో మంజూరైన రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సింగరేణి సౌజన్యంతో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో రూ.18 లక్షలతో నిర్మించిన రెండు మినరల్ వాటర్ప్లాంట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.కోటితో నిర్మాణమవుతున్న ఫంక్షన్‌హాల్ పనులను పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎస్సీకాలనీ మాలపల్లికి త్వరలోనే మరో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రేజర్లలో బస్టాండ్ నుంచి రామాలయం వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేశామని, రేజర్ల నుంచి సిద్ధారం, రేజర్ల నుంచి సదాశివునిపాలెం వరకు రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు బీటీ రోడ్డు వేశామని తెలిపారు. గ్రామంలో కొందరు దళితులకు ఎన్టీఆర్ ప్రత్యామ్నాయ భూముల్లో నష్టపరిహారం అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆర్డీవో, తహసీల్దార్లను పంపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సాయం మార్చి మొదటివారం నుంచి ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలకు అవసరమైన అవసరాలు తీర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని, తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు.
నిత్యం ప్రజల కోసం ఆలోచించి రాష్ర్టాన్ని పురోగతిలో నడిపిస్తున్న కేసీఆర్‌కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని సూచించారు. ఎమ్మెల్యే సండ్రకు గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల ప్రభాకర్‌రావు, ఎంపీటీసీ విస్సంపల్లి వెంకటేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఎంపీడీవో సుభాషిణి, సింగరేణి ఏజీఎం సూర్యనారాయణ, గ్రంథాలయ సంస్థ జడ్పీ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి, భీమిరెడ్డి గోపాలరెడ్డి, గొర్ల వెంకటరెడ్డి, భీమిరెడ్డి నాగిరెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, దేశిరెడ్డి నాగిరెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి, కంభంపాటి రాంబాబు, గుర్రాల సురేశ్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.