కారేపల్లి,సెప్టెంబర్ 21: ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండలం ఉసిరికాయలపల్లిలో ప్రతి ఏటా విజయదశమిని పురస్కరించుకుని నిర్వహించే కోట మైసమ్మ జాతర ఏర్పాట్లపై స్థానిక శాసన సభ్యుడు మాలోత్ రామదాసు నాయక్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి జాతరకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను దేవాదాయ శాఖ కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ సమీక్ష సమావేశంలో కోట మైసమ్మ తల్లి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ పర్స పట్టాభి రామారావు, తహసిల్దార్ సురేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, దేవాదాయ శాఖ ఈవో కొండ కింది వేణుగోపాలచార్యులు, సిఐ తిరుపతిరెడ్డి ఎస్సై బైరు గోపి, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పగడాల మంజుల, ఐకెపి ఏపియం పిడమర్తి వెంకటేశ్వరరావు, ఆర్ఐ సుభాదేవి, మండల వైద్యాధికారి బి. సురేష్, ఏఈ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.