అందరూ ఒక్కటయ్యారు. అభివృద్ధిలో చేయి కలిపారు. సంక్షేమంలో పారదర్శకత పాటించారు.. ఇంకేముంది ఒకనాడు వెలవెలబోయిన ఆ గ్రామంలో మూడు పువ్వులు.. ఆరు కాయలు చందంగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. ఎన్నికల సమయంలోనే కొంత రాజకీయ వాతావరణం కనిపిస్తుంది తప్ప.. మిగిలిన రోజుల్లో ఎవరి పని వారిది. సమయం దొరికితే ఊరికోసమే కష్టపడతారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవడంలో పంచాయతీ పాలకవర్గం సఫలంకావడంతో ప్రజల మన్ననలను చూరగొన్నది. గ్రామంలోని 578 ఇండ్లలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే తెలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుంటారు ‘పొన్నెకల్ పోయొద్దాం.. అభివృద్ధిని చూసొద్దాం’అని.
ఖమ్మం రూరల్, ఆగస్టు 31 : హైదరాబాద్- ఖమ్మం జాతీయ రహదారికి పక్కనే ఉన్నప్పటికీ వ్యవసాయరంగానికి పొన్నెకల్ గ్రామం పెట్టింది పేరు. సీజన్‌కు అనుగుణంగా పంటలు పండించడంతోపాటు రైతు పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో గ్రామస్తులకు వారికి వారేసాటి. రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో రైతువేదికను ఏర్పాటు చేసింది. మొక్కల పెంపకంలో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రామస్తులు, పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేయడంతో హరితహారంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లెప్రగతి’ ద్వారా గ్రామంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర గ్రామాల మాదిరిగానే ఈ గ్రామంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామం, తడిచెత్త, పొడిచెత్త షెడ్(డంపింగ్ యార్డు), పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. గ్రామంలో ఉపాధిహామీ పథకం, ఇతర నిధుల ద్వారా గడిచిన ఐదేళ్లలో సుమారు రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని కాపాడి పెద్దచేయడంతో గత సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నది. కొద్దిరోజుల క్రితం జిల్లావ్యాప్తంగా ఉత్తమ నర్సరీల్లో ఒకటిగా పొన్నెకల్ ఎంపిక కావడం విశేషం.
లబ్ధిదారుల వివరాలు..
పొన్నెకల్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నెలువుగా మారిందని చెప్పవచ్చు. గ్రామంలో 578 ఇండ్లకు 308 మంది పింఛన్‌దారులు ఉన్నారంటే సంక్షేమ పథకాలు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఓఏపీ పింఛన్‌దారులు 98, చేనేత 8, వితంతువులు 129, దివ్యాంగులు 63, ఒంటరి మహిళలు 10మంది ఉన్నారు. ఇందుకు నెలకు ప్రభుత్వం ఈ ఒక్క గ్రామంలోనే రూ.6.77 లక్షలను ఖర్చు పెడుతున్నది. వీటితోపాటు 578 ఇండ్లకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ప్రతి వానకాలం, ఎండాకాలంలో కలిపి రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి పథకం పొందుతున్న రైతులు 506 మంది ఉన్నారు. రైతుబీమా పథకం ద్వారా నేటివరకు 12 కుటుంబాలు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం పొందాయి. 52 కుటుంబాలు కల్యాణలక్ష్మి, మూడు కుటుంబాలు షాదీముబారక్ డబ్బులు అందుకున్నాయి. 21మంది జీవాల పెంపకందారులు 75శాతం రాయితీపై గొర్రెలను పొందారు. కేసీఆర్ కిట్లు, ఆర్థిక ప్రయోజనం పొందిన మహిళలు మరో 132మంది ఉన్నారు. 18 కుటుంబాల వారు రూ.1.10 కోట్ల నిధులతో నిర్మించిన డబుల్ బెడ్రూంలను పొంది ఉన్నారు.
అడుగడుగునా అభివృద్ధి..
గ్రామంలో ఒకవైపు సంక్షేమ పథకాల జాతర సాగుతుండగా.. మరోవైపు పంచాయతీ పాలకవర్గం గ్రామాభివృద్ధిలో అదే ఒరవడి కొనసాగిస్తున్నది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తుండడంతో గ్రామంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. కోట్లాది రూపాయల నిధులతో జరిగిన నిర్మాణాలు నేడు గ్రామంలో సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం నుంచి మొదలైన అభివృద్ధి.. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేస్థాయికి చేరింది. నేటివరకు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.54 లక్షలు, పంచాయతీ నుంచి మరో రూ.33.50 లక్షలతో ఏర్పాటుచేసిన సీసీ రోడ్లతో గ్రామం కళకళలాడుతున్నది. మరో 51 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటితోపాటు మరో రూ.81 లక్షల వ్యయంతో సైడుకాల్వలు నిర్మించి మురుగునీటి సమస్య లేకుండా చేశారు. అంతేకాక గ్రామానికి తలమానికంగా రైతువేదికను రూ.22 లక్షలు, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.3.50 లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.2 లక్షలతో డంపింగ్‌యార్డును నిర్మించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి కొద్దిరోజుల్లో ఇండ్ల స్థలాలను సైతం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నర్సరీల నిర్వహణ భేష్
పల్లెప్రగతిలో భాగంగా గత సంవత్సరం ఏర్పాటు చేసిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలు పబ్లిక్పార్కులను తలపిస్తున్నాయి. గ్రామానికి అతి సమీపంలోనే ఎకరం సువిశాల స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. దీనిలో 200రకాల పూలు, పండ్లు, ఇతర మొక్కలను నాటారు. పార్కులో ఉదయం, సాయంత్రం నడిచేందుకు ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా రోడ్లను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం నాటిన మొక్కలు ఇప్పటికే పూలు, పండ్లను అందిస్తున్నాయి. అగ్రి ఫారెస్టుకు అద్దం పట్టే విధంగా టేకు, నల్లమద్ది, తెల్ల ఉసిరి, నల్ల ఉసిరి, నేరేడు, దేవకాంచన, స్వీట్ లెమన్, సీతాఫలం వంటి చెట్లతోపాటు, దాదాపుగా 30రకాల పూలచెట్లను సైతం పెంచుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ సైతం ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నది. గత సంవత్సరం ఓ ప్రైవేట్ భూమిలో నర్సరీ నిర్వహణ కొనసాగింది. ఆరునెలల క్రితం ప్రభుత్వ భూమిలో వైకుంఠధామం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ రోడ్డుపై నుంచి వస్తున్న ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. గోరింటాకు నుంచి మొదలుకొని గులాబీ మొక్కలు, టేకు, ఇతర ప్రాముఖ్యత కలిగిన మొక్కలను పెంచుతున్నారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సైతం సందర్శించారు. జిల్లావ్యాప్తంగా ఉత్తమ నర్సరీలో ఒకటిగా కొద్దిరోజుల క్రితం పొన్నెకల్ నర్సరీ ఎంపిక కావడం విశేషం.
ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాం..
పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటినుంచి నేటివరకు గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశాం. అనతికాలంలోనే అనేక విజయాలు సాధించాం. గ్రామాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాం. గ్రామాభివృద్ధికి ప్రతిఒక్కరూ ఎంతగానో సహకరిస్తున్నారు. ఇంతటి విజయానికి ప్రధాన కారణమైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– తాటికొండ సుదర్శన్, సర్పంచ్
గ్రామస్తుల సహకారం మరువలేనిది..
గ్రామాభివృద్ధికి ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంది. ఇతర గ్రామాలకు చెందిన పలు అవగాహన సదస్సులు, కార్యక్రమాలను సైతం పొన్నెకల్లులో ఏర్పాటు చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా సుమారు వెయ్యి మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేశాం. వైకుంఠధామంలో మరో 500 మొక్కలు నాటాం. పల్లెప్రకృతి వనంలో నాటిన నాలుగు వేల మొక్కలను ఆరుగురు సిబ్బంది, ఇద్దరు వాచర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అధికారుల సంపూర్ణ సహకారం అందుతున్నది.
– నారగాని కిరణ్మయి, గ్రామ కార్యదర్శి