ఖమ్మం జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు శనివారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. మిషన్ భగీరథ పథకంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపులను కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ పెడుతూ వస్తోంది. ప్రతిసారీ కార్మికులు ఆందోళనకు దిగడం, అప్పుడు ప్రభుత్వంలో చలనమొచ్చి ఒకటీ రెండు నెలల వేతనాలు విడుదల చేయడం, ఆ తరువాత మళ్లీ పెండింగ్‌లు పెట్టడం, కార్మికులు మళ్లీ ఆందోళనబాట పట్టడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వంలో రివాజుగా మారాయి. ఈ క్రమంలో ఇటీవల కూడా ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. దీంతో తమ వేతనాలను వెంటనే చెల్లించాలన్న ఏకైక డిమాండ్‌తో జిల్లాలోని సుమారు 443 మంది కార్మికులు సమ్మె నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించాలని బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి.
-ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జిల్లాలోని మిషన్ భగీరథ పథకంలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పంపు ఆపరేటర్లుగా పనిచేస్తున్న 443 మంది కార్మికులకు మే, జూన్, జూలై నెలల వేతనాలను ఇప్పటివరకూ ప్రభుత్వం ఇవ్వలేదు. 10 రోజుల క్రితం భగీరథ ఖమ్మం ఎస్ఈతో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశమై కార్మికుల వేతనాల సమస్యను వివరించారు. ఈ నెల 21న జిల్లాలో పనిచేసే మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ఎస్ఈ మాట ఇచ్చారు. కార్మికులకు థర్డ్ పార్టీ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న సంస్థకు డిపాజిట్ చేసి ఒక నెల వేతనం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎస్ఈ చెప్పినట్లు ఈ నెల 21వ తేదీ దాటిపోయినా కార్మికులకు ఒక్క నెల వేతనం కూడా జమ కాలేదు. దీంతో శుక్రవారం కార్మికుల సంఘాల జేఏసీ ప్రతినిధులు ఖమ్మం భగీరథ ఎస్ఈని మళ్లీ కలిసి వేతనాల గురించి అడిగారు.
థర్డ్ పార్టీ ఏజెన్సీ నుంచి కార్మికులకు వేతనంగా ఇవ్వడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని, కానీ సదరు ఏజెన్సీకి 10 నెలల నుంచి ప్రభుత్వం అగ్రిమెంట్ ఇవ్వలేదని, అగ్రిమెంట్ లేని సంస్థ నుంచి డిపాజిట్ నిధులు డ్రా చేయడం సాధ్యం కాదని వివరించి చేతులెత్తేశారు. దీంతో కార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో 443 మంది కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారని వివరించారు. వేతనాల విడుదలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేంత వరకు విధులు బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు.
కార్మికుల సమ్మె కారణంగా ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు మిషన్ భగీరథ ద్వారా జరిగే తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. కార్మికులు పాలేరు, వైరా, కల్లూరు మిషన్ భగీరథ ప్రధాన ట్యాంకుల వద్ద సమావేశమై ఆయా మండలాల కార్మికులతో కలిసి ఆందోళన చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కార్మికులు నీటిని శుద్ధి చేసి భగీరథ ట్యాంకులకు ఎక్కించి ఆయా ప్రాంతాల్లో ఉన్న మంచినీటి ట్యాంకులకు పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా గ్రామ పంచాయతీల కార్మికులు ఇంటింటికీ సరఫరా చేస్తారు. అయితే కార్మికులు విధుల బహిష్కరణకు పూనుకోవడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గొంతు తడవడం కష్టతరంగా మారే ప్రమాదం నెలకొంది. నెలల తరబడి థర్డ్ పార్టీ ఏజెన్సీకి ప్రభుత్వం అగ్రిమెంట్ చేయకపోవడంతో జిల్లాలో పని చేస్తున్న కార్మికులు ఎవరి పరిధిలో పని చేస్తున్నారో.. వీరి వేతనాల బాధ్యత ఎవరిదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
మిషన్ భగీరథ కార్మికులకు మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వలేదు. దీంతో వారు తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వేతనాలు ఇచ్చే వరకూ విధులు బహిష్కరిస్తాం. బీఆర్టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేసేందుకు కార్మికులు నిర్ణయించారు.
-మద్దెల రవి, బీఆర్టీయూ మిషన్ భగీరథ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు