కొత్తగూడెం టౌన్, ఆగస్టు 15:అన్నదాతకు అండగా నిలుస్తామని, వ్యవసాయ రంగ అభివద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు పేర్కొన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలతోపాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ప్రగతిమైదానంలో గురువారం జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
తరువాత జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. 2024-25 వానకాలంలో రైతుభరోసా పథకంపై ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. రైతుబీమా కింద మరణించిన 645 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.32.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. పంటల రుణమాఫీ పథకంలో భాగంగా 2024లో మొదటి విడత రూ.లక్ష వరకు 28,018 మంది రైతులకు రూ.132 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు రుణం ఉన్న 16,377 మంది రైతులకు రూ.137 కోట్లు మాఫీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 44,495 మంది రైతులకు రూ.269 కోట్ల రుణాలను మాఫీ చేసి వారి ఖాతాల్లో సంబంధిత నగదును జమ చేశామని వివరించారు.
గోదావరి జలాల సద్వినియోగంతో రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు రూ.13.58 వేల కోట్లతో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని అన్నారు. జిల్లాలో 6 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 34,650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు నిర్మించామని, నాబార్డ్ సహాయంతో రూ.36 కోట్లతో 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 19 గోదాములు నిర్మించామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. బహుమతులు అందజేశారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.