ఖమ్మం, డిసెంబర్ 14: సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆయా పనులను త్వరితగిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టులో ఇప్పటి వరకూ జరిగిన పనుల్లో పురోగతి లేదని అన్నారు. ప్రాజెక్టు ద్వారా హెడ్ వర్స్‌కు ఎంత ఖర్చు చేయాలి? కాల్వలకు ఎంత ఖర్చు చేయాలి? భూ సేకరణకు ఎన్ని నిధులు అవసరమవుతాయి?
అనే అంశాలపై వెంటనే సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పనులు త్వరితగిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. అలాగే, ఖమ్మం జిల్లాలోని బుగ్గవాగు చెక్‌డ్యాం గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసి నిర్మించామన్నారు. ఇప్పుడు బుగ్గవాగు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ పూర్తయిన తర్వాత బుగ్గవాగును దానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. అలాగే, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగికి సాగునీరు ఇచ్చే అంశంపై రైతులకు స్పష్టతనివ్వాలని సూచించారు.