ఖమ్మం సిటీ, జూలై 28: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ప్రధాన వైద్యశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్దాసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు కంటుపడ్డాయని, ఆసుపత్రి పరిసరాలు దుర్గంధం వెదజల్లుతోందని వివరిస్తూ ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తుమ్మల ఆదివారం ప్రధాన ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలను తనిఖీ చేశారు. మాతా శిశు కేంద్రం వద్ద నిల్వ ఉన్న మురుగును వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగుల పట్ల వైద్యులు సేవాభావంతో నడుచుకోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ బీ.కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి 600 బెడ్లు మంజూరైనప్పటికీ ప్రస్తుతం 450 బెడ్లే ఉన్నాయని, మిగిలిన వాటికి అనుమతులు ఇప్పించాలని కోరారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.